నేతల ఫోటోలతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ!

Former Minister Reddy Satyanarayana Grandson Held For Job Fraud In Mangalagiri - Sakshi

చంద్రబాబు, లోకేశ్‌లతో తీసుకున్న ఫొటోలను చూపి ఎర

ఏడుగురి నుంచి రూ.14 లక్షలు వసూలు

ప్రధాన నిందితుడు రెడ్డి గౌతమ్‌ టీడీపీ మాజీ మంత్రి మనవడు     

నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన తుళ్లూరు పోలీసులు  

సాక్షి, అమరావతి : అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. లక్షలు ముట్టజెప్పితే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువతను అడ్డంగా మోసగించారు. మోసపోయిన ఒక అభ్యర్థి ధైర్యం చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నంద్యాలకు చెందిన నరాల శివనాగార్జునరెడ్డి కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలానికి చెందిన చాకలి మనోహర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.80 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీస్‌ సబార్డినేట్‌గా నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను సృష్టించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.30 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. లెటర్‌ అందజేసి మిగిలిన మొత్తాన్ని తీసుకోవాలని పథకం రచించారు. ఈ లెటర్‌పై అనుమానం రావడంతో మనోహర్‌ ఈ నెల 16న విషయాన్ని సచివాలయ అధికారుల దృష్టికి తేసుకెళ్లాడు. వారు దాన్ని నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌గా ధృవీకరించడంతో మోసపోయానని గ్రహించి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ప్రధాన నిందితుడు మాజీ మంత్రి మనవడు
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు నిందితులను గురువారం ఉదయం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రెడ్డి గౌతమ్‌ టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు. మిగిలిన ముగ్గురు నరాల శివనాగార్జునరెడ్డి, సతీష్, మిథున్‌ చక్రవర్తి టీడీపీ నాయకులు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌తో తీసుకున్న ఫొటోలను ఎరగా వేసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.  

ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు
మొత్తం ఏడుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తుళ్లూరు ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారిని విచారించగా ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగాల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబర్‌ నుంచి వీరు దందా మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top