మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న దళిత పారిశ్రామికవేత్తలు
బాబు సర్కారుకు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల అల్టిమేటం
మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట ధర్నా స్థానిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు చెల్లించకుండా విదేశీ కంపెనీలకు ఇస్తున్నారని ఆవేదన
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రాయితీలను తక్షణం విడుదల చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు అల్టిమేటం జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట 100 శాతం రాయితీల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. గతంలో మూడుసార్లు సచివాలయాన్ని ముట్టడించినా, అనేకసార్లు ఏపీఐఐసీ ఎదుట ధర్నాలు నిర్వహించినా.. రాయితీలు విడుదల చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతూ, మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని వారంతా మండిపడ్డారు.
చావనైనా చస్తాం కానీ.. రాయితీలు విడుదల చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వకుండా విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు ఇస్తామనడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. కాగా, ధర్నా సందర్భంగా ఏపీఐఐసీ కార్యాలయం వద్ద టెంట్లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ‘మాట తప్పిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్.. మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం’, ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
నిధులిచ్చే వరకు వెళ్లం
ఈ సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనాబాబు మాట్లాడుతూ నూటికి నూరు శాతం నిధులు విడుదల చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. శాంతియుతంగా తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అసోసియేషన్ కార్యదర్శి పెనుమాల నాగకుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ భారత రాజ్యాంగం అమలవుతుందా.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అసోసియేషన్ మహిళా ప్రతినిధి కారెం సత్యనారాయణమ్మ మాట్లాడుతూ.. నూరు శాతం రాయితీ నిధులు విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట ఇచ్చి తప్పడం వల్ల తాము తిరిగి ధర్నాకు పూనుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాలా నాగలక్ష్మి, జంగా త్రిమూర్తులు, చిన్న మౌలాలి, వరికూటి నీరజ, డాక్టర్ మద్దాల బిందు, కనపర్తి విజయరాజు, సరిహద్దు దయాకర్, కొడాలి రాంబాబు, జగదీష్, వి.భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.


