కొనసాగుతున్న విచారణ | Fire Accident Inquiry In Britannia Biscuit Factory At Kankipadu | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విచారణ

Aug 5 2019 6:50 AM | Updated on Aug 5 2019 6:52 AM

Fire Accident Inquiry In Britannia Biscuit Factory At Kankipadu - Sakshi

వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌

సాక్షి, కంకిపాడు(పెనమలూరు): బిస్కెట్‌ కంపెనీ గోదాములో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదం ఎలా జరిగింది? నష్టం ఎంత వాటిల్లింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ దిశగా విచారణ సాగిస్తున్నారు. మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడులో నిర్మించిన బ్రిటానియా బిస్కెట్‌ గోదాములో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించే లోపే మంటలు గోదామును చుట్టుముట్టి సర్వం బుగ్గిపాలైంది. గోదాము షట్టర్లకు తాళాలు ఉండటంతో ప్రమాద స్థాయి అధికంగా ఉండటంతో షట్టర్ల తాళాలు తీయటం సాధ్యం కాలేదు. దీంతో జేసీబీ సాయంతో గోదాము గోడలను ధ్వంసం చేయించారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గోదాములో నిల్వ చేసిన సరుకు బూడిదైంది. గోదాము రేకులు మంటల ధాటికి కాలిపోయాయి. ఆదివారం కూడా గోదాము నుంచి పొగ వెలువడింది.

కొనసాగుతున్న విచారణ..
అగ్ని ప్రమాదం ఘటనపై అగ్నిమాపక శాఖ దర్యాప్తు సాగిస్తోంది. ప్రమాదం విద్యుత్‌ షార్టు సర్క్యూ వల్ల జరిగిందా? గోదాములో నిర్వహించిన వెల్డింగ్‌ పనులు వల్ల ఏర్పడిందా? మరేదైనా కారణమా? అన్న వివిధ కోణాల్లో ఆ శాఖ విచారణ చేస్తుంది. ఆదివారం కూడా ప్రమాదం జరగటానికి గల కారణాలు వెలుగులోకి రాలేదు. ప్రమాదంలో ఏర్పడ్డ నష్టం వివరాలు కూడా తేలలేదు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోకపోవటం, ప్రమాద నివారణ జాగ్రత్తలు చేపట్టకపోవటంతో అగ్నిప్రమాద స్థాయి, నష్ట తీవ్రత అధికంగా ఉన్నాయన్న వాదన అగ్నిమాపక శాఖలో వ్యక్తమవుతుంది.
 
అన్ని అనుమతులు ఉన్నాయా? 
బ్రిటానియా కంపెనీ ఉత్పత్తులు నిల్వ చేసిన గోదాముకు పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా? అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవని ఆ శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌ ఇప్పటికే వెల్లడించారు. మరో వైపు మే నెలలో గోదాములో సరుకు నిల్వ చేయటం ప్రారంభించారని తెలుస్తుంది. సీఆర్‌డీఏ నుంచి గోదాము నిర్మాణానికి అనుమతులు కోసం పంచాయతీని సంప్రదించారని, తరువాత పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక ఎన్‌వోసీ కోసం ఎలాంటి అనుమతి పత్రాలను ప్రొద్దుటూరు పంచాయతీకి అప్పగించలేదని సమాచారం. కనీసం అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రమాద నివారణకు సైతం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల నష్టం భారీగా సంభవించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ విషయమై ప్రొద్దుటూరు పంచాయతీ పూర్వ కార్యదర్శి శివకృష్ణను వివరణ కోరగా, సీఆర్‌డీఏ అనుమతులు కోసం పంచాయతీని సంప్రదిస్తే అందుకు అవసరమైన తీర్మానం ఇచ్చామన్నారు. అయితే పూర్తి అనుమతులకు సంబంధించి ఎలాంటి ప్రతులు తమకు అందలేదన్నారు. అనుమతి పత్రాలు, పన్నుల విధింపులకు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా స్పందించలేదన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement