వైద్యం వికటించి గర్భిణి మృతి

Fake Women Doctor Arrest in Tamil nadu - Sakshi

నకిలీ మహిళా డాక్టర్‌ అరెస్టు

తిరువొత్తియూరు: అబార్షన్‌ చేసేందుకు ఇంజక్షన్‌ వేయడంతో గర్భిణి మృతి చెందిన సంఘటన పొల్లాచ్చి సమీపంలో జరిగింది. ఈ వ్యవహారంలో నకిలీ మహిళా డాక్టర్‌ను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. పొల్లాచ్చి, మెట్టువావికి చెందిన సెల్వరాజ్‌ భార్య వనితామణి (38). వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వనితామణి మళ్లీ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు గర్భస్రావం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. వడచిత్తూరుకు చెందిన సిద్ధా డాక్టర్‌ ముత్తులక్ష్మి నడుపుతున్న క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఏప్రిల్‌ 28న ముత్తులక్ష్మి, వనితామణికి ఇంజక్షన్‌ వేసింది. అది వికటించడంతో వనితామణి మృతి చెందింది. దీనిపై వనితామణి కుమారుడు మారిముత్తు (19) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తులక్ష్మి, ఆమె కుమారుడు కార్తీక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. విచారణలో వనితామణికి కాలం చెల్లిన మందును ఎక్కించడం వల్లే మృతి చెందినట్టు తెలిసింది.

మంగళవారం సాయంత్రం కోవై జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్‌ కమిషనర్‌ భానుమతి నేతృత్వంలో కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్‌ డైరక్టర్‌ కృష్ణ, జిల్లా సిద్ధ వైద్య కార్యాలయ అధికారి ధనం తదితరులు ముత్తులక్ష్మి క్లినిక్‌తో పాటు ఆమె ఇంటిని తనిఖీ చేశారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి నడుపుతున్న క్లినిక్‌లో కాలం చెల్లిన ఆయుర్వేద మందులు, ఆంగ్ల మందులు, మాత్రలు ఉండడం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని క్లినిక్‌కు తాళం వేశారు. అనంతరం మెట్టువావికి వెళ్లి వనితామణి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. మంగళవారం జరిపిన విచారణలో ముత్తులక్ష్మి సిద్ధవైద్యం చదవలేదని, సిద్ధవైద్యం పేరుతో అలోపతి వైద్యం చేస్తున్నట్టు తెలిసింది. వడచిత్తూరు ప్రాంతంలో ముత్తులక్ష్మి ఆరేళ్లుగా క్లినిక్‌ నడుపుతోంది. గత ఏడాది ఓ యువకుడు జ్వరానికి చికిత్స తీసుకుని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆ సమయంలో క్లినిక్‌ను పరిశీలించిన పోలీసులు చికిత్స చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు.

బంధువు ఇంట్లో..
నాగపట్టినంలోని బంధువు ఇంటిలో నకిలీ మహిళా డాక్టర్‌ ముత్తులక్ష్మి దాగి ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్‌ వెట్రివేల్‌కు సమాచారం వచ్చింది.    బుధవారం పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పొల్లాచ్చికి తీసుకొచ్చి విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ వైద్యానికి సహకరిస్తున్న ముత్తులక్ష్మి కుమారుడు కార్తీక్‌ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top