బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

Enforcement Directorate Filed Case Against Bollineni Srinivasa Gandhi - Sakshi

మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈసీఐఆర్‌ నమోదు

ఆస్తుల ఎటాచ్‌కు ఈడీ సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘కత్తి పట్టుకుని వీరంగం చేసినోడు అదే కత్తికి బలవుతాడు’ అన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)లో తన పోస్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటివారిపై విరుచుకుపడిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఆ విభాగమే కన్నేసింది. ఆయనపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌) దాఖలైంది. గాంధీ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై ఈ మేరకు కేసు నమోదు చేశారు.

288 శాతం మేర పెరిగిన ఆస్తులు
సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం మేర పెరిగాయి. ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, ఈడీలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్‌ చేయడం, అనుకూలంగా వ్యవహరించాలని కోరిన వారిని విడిచిపెడుతూ భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్‌ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏకంగా రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే.

చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధికారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. కొన్ని నెలల క్రితమే ఆయన్ను బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్‌లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఇలా వరుసగా కీలక పోస్టింగులు పొందడం వెనుకా చంద్రబాబు సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బొల్లినేని గాంధీపై కొంతకాలంగా వరుస ఫిర్యాదులు అందుకున్న సీబీఐ హైదరాబాద్‌ విభాగం.. విజయవాడతోపాటు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వ ఉన్నట్లు, ఆయన పేరిట హెదరాబాద్‌లో ప్లాట్లు, స్థిరాస్తులు, కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top