ఆరు నిమిషాల్లోనే దొంగను పట్టేశారు!

Eluru Police Arrest Thief With In SiX Minutes - Sakshi

సత్ఫలితాలిస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్‌

సాక్షి, ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) సత్ఫలితాలిస్తోంది. ఈ విధానంతో ఏలూరు సత్రంపాడులోని ఒక ఇంటిలో చోరీకి పాల్పడిన దొంగను కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో తొలిసారిగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ టెక్నాలజీతో దొంగను పట్టుకున్న కేసు ఇదే. ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు, త్రీటౌన్‌ సీఐ పి.శ్రీనివాసరావు సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.

తాడేపల్లిగూడెం కోర్టులో పనిచేస్తున్న వైఎల్‌ఎన్‌ మూర్తి ఏలూరు సత్రంపాడులో నివాసం ఉంటున్నారు. ఆయన కుటుంబంతో తిరుపతికి వెళ్తూ ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు మార్చి 29న త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మూర్తి ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 1న అర్ధరాత్రి 12.30 గంటలకు శొంఠి దుర్గారావు అనే దొంగ ఇంటిలోకి ప్రవేశించడంతో సీసీ కెమెరాలో అతడి కదలికలు నమోదయ్యాయి. దీంతో 12.31 నిమిషాలకు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది.

వెంటనే పోలీస్‌ అధికారులు స్పందించి స్థానిక అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. 12.37 నిమిషాలకు ఎస్‌ఐ పైడిబాబు, కానిస్టేబుల్‌ సతీశ్‌లు సంఘటనా స్థలానికి వెళ్లగా దొంగ పారిపోయేందుకు ప్రయత్నించడంతో వెంటపడి పట్టుకున్నారు. రూ.వెయ్యి నగదుతోపాటు, యునికార్న్‌ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

పాత నేరస్తుడే..
సత్రంపాడులో దొరికిపోయిన దొంగ పాత నేరస్తుడుగా పోలీసులు గుర్తించారు. మచిలీపట్నంకు చెందిన శొంఠి దుర్గారావు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాడు. అతడి నుంచి పోలీసులు రూ.వెయ్యి, యూనికార్న్‌ బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దుర్గారావు వ్యసనాలకు బానిసై చోరీలు చేస్తున్నాడని, అతడిపై గతంలో బాపట్ల, గుడివాడ, మచిలీపట్నం, గుంటూరులో చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

పోలీసులకు అభినందనలు
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తన ఇంట్లో సొత్తు కాపాడుకోగలిగానని కోర్టు ఉద్యోగి మూర్తి అన్నారు. తమ మొబైల్‌ ద్వారా ఇంట్లో దొంగ కదలికలు చూడగలిగామని చెప్పారు. పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top