బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

ED Case On Bollineni Srinivasa Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కత్తి పట్టుకుని వీరంగం చేసినోడు అదే కత్తికి బలవుతాడు’అన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)లో తన పోస్టును అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటివారిపై విరుచుకుపడిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఆ విభాగమే కన్నేసింది. ఆయనపై మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) దాఖలైంది. గాంధీ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్ర మా స్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై కేసు నమోదు చేశారు. 

288 శాతం పెరిగిన ఆస్తులు 
సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం మేర పెరిగాయి. ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, ఈడీలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్‌ చేయడం, అనుకూలంగా వ్యవహరించమన్నవారిని విడిచిపెట్టడం చేస్తూ భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్‌ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏకంగా రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే.

చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధికారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. కొన్ని నెలల క్రితమే ఆయన్ను బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్‌లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఇలా వరుసగా కీలక పోస్టింగులు పొందడం వెనుకా చంద్రబాబు సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బొల్లినేని గాంధీపై కొంతకాలంగా వరుస ఫిర్యాదులు అందుకున్న సీబీఐ హైదరాబాద్‌ విభాగం.. విజయవాడతోపాటు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వ ఉన్నట్లు, ఆయన పేరిట హెదరాబాద్‌లో ప్లాట్లు, స్థిరాస్తులు, కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. 

సుజనా కేసులో భారీగా లబ్ధి? 
1992లో సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 2003లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆయన ఏడాది పాటు అందులో పనిచేశారు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లి రాజకీయ అండదండలతో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా అక్కడే విధులు నిర్వర్తించారు. ఇలాంటి పోస్టుల్లో పనిచేసి వచ్చినవారికి జీఎస్టీలో కీలక పోస్టు ఇవ్వరు. అయితే అందుకు భిన్నంగా అందులోనూ గాంధీకి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసును సైతం పర్యవేక్షించిన గాంధీ ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారని, ఇందులో భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కారణంగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సుజనా చౌదరి అరెస్టు కాలేదని తెలుస్తోంది. గత పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్‌ సీటుకే రూ.70 లక్షలు చెల్లించారు. ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3.74 కోట్లుగా ఉంది. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, నగరంలోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిల్లో స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ తన ఈసీఐఆర్‌లో ఆరోపించింది. దీన్ని దర్యాప్తు చేస్తున్న ఈడీ హైదరాబాద్‌ యూనిట్‌ అధికారులు.. గాంధీ ఆస్తుల్ని ఎటాచ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఆయనకు సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించారని తెలిసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top