మాస్టర్‌ప్లాన్‌ రక్తసిక్తం

Double Murder Case Reveals Karnataka Police - Sakshi

భూకబ్జా పర్వంలో వృద్ధుడు, వాచ్‌మెన్‌ భార్య హత్య  

పోలీసు విచారణలో నోరువిప్పిన వాచ్‌మెన్‌  

కబ్జాదారు, డాక్టర్‌ సహా 8 మంది అరెస్టు  

బెంగళూరు తూర్పు పరిధిలో దారుణం  

కర్ణాటక, బనశంకరి: ఖరీదైన 8 గుంటల భూమి ఎంత పనిచేసింది? నకిలీ వ్యక్తులు, నకిలీ పత్రాలకు తోడు హత్యలతో రక్తసిక్తమైంది. తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ కొద్ది రోజుల క్రితం వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన బెంగళూరు గ్రామీణ పోలీసులకు విచారణలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. బుధవారంబెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హొసకోటె తాలూకా నింబెకాయిపుర గ్రామంలో ఓ పొలానికి కాపలాదారుడిగా పని చేస్తున్న వెంకటస్వామి అనే వ్యక్తి తన భార్య సుధారాణి ఆత్మహత్య చేసుకుందంటూ ఈనెల 18వ తేదీన హొసకోటె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన హొసకోటె పోలీసులకు మృతురాలు భర్త వెంకటస్వామి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా, నిజాలు బయటపెట్టాడు. 

8 గుంటల భూమితో ఆరంభం  
బెంగళూరు తూర్పు తాలూకా బెళతూరు గ్రామంలో సర్వే నంబర్‌ 81లో ఎనిమిది గుంటల స్థలానికి హక్కు దారులు ఎవరూ లేకపోవడం స్థలం రూ.18 కోట్ల విలువ చేస్తుందని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తి భూ కబ్జాకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో స్థలం పూర్వపరాలను పరిశీలించిన రమేశ్‌కు నంజప్ప అనే వ్యక్తి పేరుతో స్థలం ఉన్నట్లు గుర్తించాడు. నంజప్పతో పాటు అతడి వారసుల జాడ కూడా తెలియకపోవడంతో పథకానికి పదును పెట్టాడు. ఈ క్రమంలో మాదిగ దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరప్ప సూచన మేరకు వెంకట రమణప్ప అనే 95 ఏళ్ల వృద్ధుడిని తీసుకొచ్చి నంజప్పగా నమ్మించడానికి నకిలీ ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, చిరునామా పత్రాలు తయారు చేయించాడు.  దీంతోపాటు స్థలానికి కాపలాగా వెంకటస్వామి, సుధారాణి అనే దంపతులను నియమించుకున్నాడు.  

కాపలాదారు దంపతుల మధ్య ఘర్షణ  
ఈ వ్యవహారాలన్నింటిలో స్థలం కాపలాదారుడు వెంకటస్వామి కూడా పాలు పంచుకోవడంతో ప్రతీరోజూ ఇంటికి ఆలస్యంగా వెళుతుండేవాడు. దీంతో ఎందుకు ఆలస్యంగా వస్తున్నావంటూ భార్య సుధారాణి తరచూ ప్రశ్నిస్తుండడంతో ఒకరోజు జరిగిన విషయం మొత్తం భార్యకు చెప్పేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 18వ తేదీన మళ్లీ గొడవ జరగ్గా మద్యం మత్తులో ఉన్న వెంకటస్వామి భార్య సుధారాణిని బలంగా కొట్టడంతో ఆమె మరణించింది. వెంకటస్వామి కిరోసిన్‌ పోసి ఆమె మృతదేహాన్ని కాల్చివేసి తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు అందులో భాగంగా వెంకటస్వామిని ప్రశ్నించగా పొంతన లేకుండా మాట్లాడడంతో తమదైన శైలిలో అసలు విషయాన్ని లాగారు.  

హత్యలకు తెరలేచిందిలా  
అయితే నంజప్ప అలియాస్‌ వెంకటరమణప్పను చంపేస్తే ఇక స్థలం సొంతమవుతుందని అనుకున్నారు. కిందుకు వెంటకరమణప్ప కుమారుడు వెంకటేశ్‌ అందుకు ససేమిరా అనడంతో చేసేదేమి లేక రమేశ్, శంకరప్పలు మరొక వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ క్రమంలో కోలారు బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ముళబాగిలకు చెందిన కృష్ణప్పపై వీరి కన్ను పడింది. అతన్ని పిల్చుకెళ్లి విరేచనాలు కలిగించే మాత్రలు కలిపిన మద్యం తాగించడంతో కృష్ణప్ప మృతి చెందాడు. అనంతరం కృష్ణప్పను నంజప్పగా నమ్మిస్తూ సిద్ధం చేసిన నకిలీ ధృవపత్రాలతో అమృత్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యుడు కులకర్ణి సహాయంతో నంజప్ప పేరుతో మరణధృవ పత్రాన్ని తీసుకున్నారు. అనంతరం కృష్ణప్ప మృతదేహాన్ని దహనం చేసి చితాభస్మాన్ని మండ్య జిల్లా శ్రీరంగపట్టణంలో నిమజ్జనం చేశారు.   

డాక్టర్‌ సహా వరుస అరెస్టులు  
దీంతో సుధారాణి హత్యతో పాటు ఆస్తి కోసం కృష్ణప్ప అనే వృద్ధుడి హత్య ఉదంతం కూడా వెలుగు చూసింది. దీంతో రమేశ్, శంకరప్ప, వెంకటస్వామిలతో పాటు నకిలీ ధృవపత్రాలకు సహకరించిన వైద్యుడు కులకర్ణి, మాజీ ప్రొఫెసర్‌ ధనంజయ, స్టాంప్‌ వెండర్‌ కృష్ణప్ప, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ కృష్ణమూర్తి, వెంకటరమణప్ప కుమారుడు వెంకటేశ్, హక్కుదారులు లేని స్థలాలు చూపించే కేశవమూర్తిలను అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top