మిస్టరీగానే జంట హత్యల కేసు

Double Murder Case Mystery Still Pending in Srikakulam - Sakshi

హంతకులు ఎవరన్నది అంతబట్టని వైనం

శ్రీకాకుళం రూరల్‌: మండలంలోని చాపురం పంచాయతీ పరిధి బొందిలిపురం విజయ్‌నగర్‌ కాలనీలో ఈ నెల 7న హత్యకు గురైన మెహర్‌ ఉన్నీషా, జురాబాయ్‌ల కేసు ఇంకా చిక్కుముడి వీడలేదు. వీరివురూ హత్యకు గురై ఐదు రోజులు కావస్తున్నా పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా నలుగురు డీఎస్పీలతోపాటు ఐదుగురు సీఐలు ఇతరత్రా సిబ్బంది వివిధ కోణాల్లో విచారణ చేపట్టినా కనీసం అనుమానితులను గుర్తించలేకపోయారు. పైగా జిల్లా చరిత్రలో ఇలాంటి హత్యలు ఇంతవరకూ జరగలేదు. దీంతో ఈ కేసు జిల్లా పోలీసులకు సవాల్‌గానే మారింది. ఎంతలోతుగా విశ్లేషణ చేసినప్పటికీ హంతకులు ఎవరన్నది  మాత్రం అంతుచిక్కడం లేదు.

ఈ కేసులో హత్యలకు గురైన మెహర్‌ఉన్నీషా, జురాబాయ్‌ శరీరాలపై కనీసం వేలిముద్రలు పడకుండా హంతకుడు జాగ్రత్త పడటంతో పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారింది. ఈ హత్యలు జరిగిన రోజు ఇంట్లో కొన్ని నకిలీ నగలను (రోల్డ్‌గోల్ట్‌) మాత్రం పట్టుకెళ్లలేదని పోలీసుల విచారణలో తెలిసింది. దీన్నిబట్టి తెలిసిన వారే చేశారా? లేక ఎవరితోనైనా చేయించారా? అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.  

వెలుగులోకి వస్తున్న కొత్తకోణం
ఈ హత్యలకు సంబంధించి కుటుంబ, ఆస్తు తగాదాలా.. లేక వివాహేతర సంబంధాలా.. అన్న కోణంలో పోలీసులు దృష్టిసారించారు. అయితే ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నదానిపై పోలీ సులు కూపీ లాగుతున్నారు. జిలానీ ఇంటికి రోజూ ఎవరెవరు వచ్చి వెళ్తున్నా రు, పాల వాడి దగ్గర నుంచి పేపరు బాయ్‌ వరకూ ప్రతీ కోణంలో ఆరా తీస్తున్నారు. గతంలో జిలానీకి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అన్న విషయాలపై తెలుసుకుంటున్నట్లు సమాచారం.

ఫోన్‌ కాల్స్‌పై దర్యాప్తు ముమ్మరం
హతుల ఫోన్‌కాల్స్‌పై కూడా పోలీసులు తనదైన శైలిలో దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన ముందు ఎవరెవరితో మాట్లాడారన్న కోణంలో దర్యాప్తు చేస్తూ కాల్‌డేటా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరో రెండు, మూడు రోజుల్లో నిందితులు ఎవ్వరన్నది గుర్తించే అవకాశముందని సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top