క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టు

Cricket Betting Gang Arrest In Kurnool - Sakshi

ఇద్దరు బుకీలు,నలుగురు బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు..

రూ.6.10 లక్షల నగదు,5 సెల్‌ఫోన్లు, 3 పాస్‌పోర్టులు స్వాధీనం  

పది మంది బ్యాంక్‌ లావాదేవీలు నిలిపివేత  

ఆరుగురిపై రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌  

కర్నూలు : నగరంలో వాట్సాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్‌ ముఠా ఆట కట్టించారు.  ఇద్దరు బుకీలు, నలుగురు బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్ట్‌ వారి వద్ద నుంచి రూ.6.10 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, 3 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్‌ జట్టి డీఎస్పీ ఖాదర్‌ బాషాతో కలిసి వివరాలు వెల్లడించారు. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించి గత నెల 23న  పాతబస్తీలోని లాల్‌ మసీదు ఎదురుగా ఉన్న సొహైల్‌ ఇంటితో పాటు బిర్లా కాంపౌండ్‌లోని శశికాంత్‌ ప్లాజాలోని మల్లికార్జునగౌడ్‌ ఆఫీస్‌ (సారథి కమ్యూనికేషన్స్‌)లో సోదాలు నిర్వహించి మొత్తం 22 మంది నిందితులను గుర్తించి 8 మందిని అరెస్టు చేశారు. విచారణలో మరికొంతమంది ఉన్నట్లు తేలడంతో నిఘా వేశారు. ఈ మేరకు బుకీలు షేక్‌ మహమ్మద్‌ షొయబ్, ఖలీల్‌ మజీద్‌ ఖాన్, బెట్టింగ్‌ రాయుళ్లు షేక్‌ మహమ్మద్‌ అసిఫ్, షేక్‌ మహమ్మద్‌ షబ్బీర్, ఖలీల్, షర్జిల్‌ ఖాన్, మగ్బూల్‌ అహ్మద్‌ను పట్టుకున్నారు.

బుకీలు ప్రధాన బుకీ ప్రొద్దుటూరు శంకర్‌తో నందికొట్కూరుకు చెందిన రఫీ ద్వారా పరిచయం పెంచుకుని కర్నూలులో బెట్టింగ్‌ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో వెలుగుచూసింది. ఇప్పటివరకు నలుగురు బెట్టింగ్‌ నిర్వాహకులు, 15 మంది బెట్టింగ్‌రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొత్తం రూ.12.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో బెట్టింగ్‌ రాకెట్‌ను పూర్తిగా అరికడతామన్నారు. బెట్టింగ్‌లో పాల్గొన్న పది మంది బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేసినట్లు వెల్లడించారు. అలాగే బెట్టింగ్‌కు పాల్పడిన ఆరుగురిపై రౌడీషీట్లతో పాటు పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి యువత చెడుదారిన పడకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను గమనిస్తుండాలని సూచించారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను పట్టుకోవడంలో చొరవ చూపిన ఒకటో పట్టణ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పోలీసు సిబ్బంది బాలరాజు, మహబూబ్‌ బాషా, రఘునాథ్‌ తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.  

జిల్లాలో ఎలాంటి గ్యాంగ్‌లు లేవు... పుకార్లు నమ్మొద్దు...  
జిల్లాలో చెడ్డీ, పార్థి గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయంటూ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, అలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని ఎస్పీ కోరారు. కొత్త వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారమిచ్చి పట్టించాలి తప్ప దాడిచేయడం సరికాదన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top