వాసుబాబు, నారాయణకు రిమాండ్‌ 

CID Custody to the Vasubabu and Narayana in EAMCET Leakage - Sakshi

బుధవారంతో ముగిసిన సీఐడీ కస్టడీ 

నాంపల్లికోర్టులో  ప్రవేశపెట్టిన అధికారులు 

చంచల్‌గూడకు తరలింపు 

గత దర్యాప్తు అధికారుల తీరుపై అనుమానం 

ఇంటెలిజెన్స్‌తో విచారణ..రుజువైతే సస్పెన్షన్‌! 

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శ్రీచైతన్య మాజీ డీన్‌ వాసుబాబు, నారాయణ కళాశాల ఏజెంట్‌ శివనారాయణలకు సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో వీరిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం వీరి కస్టడీ ముగియడంతో సాయంత్రం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా శివనారాయణను సీఐడీ బృందం భువనేశ్వర్‌ తీసుకెళ్లి విచారించిన విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని రాజధాని హోటల్‌లో 4 రూములు బుక్‌ చేసి 18 మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ ఆధారాలు రాబట్టింది.

ఇందులో రెండు గదులు శివనారాయణ బంధువులమ్మాయి పేరుతో, మరో రెండు గదులు వరంగల్‌ జిల్లాకు చెందిన తిరుపతిరెడ్డి పేరుతో ఉన్నట్లు హోటల్‌ రికార్డుల ద్వారా తెలిసింది. హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌కు మేక్‌ మై ట్రిప్‌ ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసినట్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్వాన్స్‌ రూపంలో రూ.65 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వాసుబాబు, శివనారాయణ వెల్లడించినట్లు అధికారుల ద్వా రా తెలిసింది. సీఐడీ కస్టడీలోని వీరిద్దరినీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు బుధవారం ప్రశ్నించారు. కార్పొరేట్‌ కాలేజీలకు చెందిన మరో వ్యక్తి వ్యవహారంపై వారిని ఆరా తీసినట్లు తెలిసింది.  

గత దర్యాప్తు అధికారులపై నజర్‌ 
గతంలో దర్యాప్తు అధికారులుగా పనిచేసిన వారిపై పోలీస్‌శాఖ దృష్టి సారించింది. రెండుసార్లు చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఆ అధికారులపై సీఐడీ ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులోని కీలకాంశాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురాకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని, దీని వెనకున్న రహస్యా న్ని బయటపెట్టేందుకు అంతర్గత విచారణకు ఆదేశించామని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య మాజీ డీన్‌ను విచారణ పేరుతో పిలిచి పంపేయడం, ఆ తర్వాత మరో కార్పొరేట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌నూ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో పోలీస్‌ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.

కేసును కేవలం బిహార్‌ గ్యాంగ్‌కు అంటగట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారని, కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి వారి నుంచి భారీగా దండుకున్నారని పోలీస్‌ పెద్దలు అనుమానిస్తున్నారు. దాదాపు రూ.1 కోటి వరకు దర్యాప్తు అధికారుల మీదుగా చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఏమాత్రం ఆధారం దొరికినా దర్యాప్తు అధికారి, ఆయనకు సహకరించిన డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top