ముఠాపై తూటా... | Sakshi
Sakshi News home page

ముఠాపై తూటా

Published Thu, Apr 12 2018 8:21 AM

Chains Knitting Bawaria Bike Gang - Sakshi

బనశంకరి : చైన్‌స్నాచింగ్‌ పాల్పడి బైక్‌పై ఉడాయిస్తున్న బావరియాగ్యాంగ్‌ సభ్యులపై ఉత్తరవిభాగం పోలీసులు కాల్పులు జరిపి ఒకరిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో చైన్‌స్నాచర్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బావరియా గ్యాంగ్‌ నగరంలో మకాం వేసి  బైకుల్లో సంచరిస్తూ  మహిళల మెడల్లో గొలుసులు అపహరించే ఉడాయించేది. బెంగళూరు ఉత్తరవిభాగంలో ఇటీవల ఆ గ్యాంగ్‌ సభ్యులు మూడునాలుగుచోట్ల  చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. దీంతో ముఠాను అరెస్ట్‌ చేసేందుకు ఉత్తరవిభాగం డీసీపీ చేతన్‌సింగ్‌రాథ్‌డ్‌ ఆధ్వర్యంలో యశవంతపుర ఏసీపీ రవిప్రసాద్, మహాలక్ష్మీలేఔట్‌ సీఐ లోహిత్, నందినీలేఔట్‌  సీఐ కాంతరాజు, ఆర్‌ఎంసీ.యార్డు సీఐ రామప్ప, ఎస్‌ఐ సోమశేఖర్లు బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. నిందితులు పంజాబ్‌ రిజిస్ట్రేసన్‌ కలిగిన బైక్‌ ఉపయోగిస్తన్నట్లు సమాచారంతో  సూలదేవనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీపురక్రాస్‌ వద్ద మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు.

ఆ సమయంలో పంజాబ్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన బజాజ్‌పల్సర్‌బైక్‌ రాగానే కానిస్టేబుళ్లు బిరాదార, ఇమామ్‌సాబ్‌కురికుట్టిలు వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన చైన్‌స్నాచర్లు ఓ కానిస్టేబుల్‌ గొంతుపై కత్తితో దాడి చేసి ఉడాయించారు. చైన్‌స్నాచర్లు నీలగిరి తోపులో పారిపోతుండగా ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక పోలీస్‌బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి  గాలింపుచర్యలు చేపట్టింది. రాత్రి 11.50 గంటల సమయంలో సోమశెట్టిహళ్లి సమీపంలోని కెరెగుడ్డదహళ్లి వద్ద నిందితలులు పారిపోతుండగా పోలీసులు గుర్తించి పట్టుకోవడానికి యత్నించారు. నిందితులు ఎదురు తిరిగి కానిస్టేబుల్‌ ఇమామ్‌సాబ్‌కురికుట్టిపై చాకుతో దాడికి యత్నించగా అప్రమత్తమైన నందీనీలేఔట్‌ ఎస్‌ఐ సోమశేఖర్‌ కాల్పులు జరిపారు.

బుల్లెట్లు చైన్‌స్నాచర్‌ రామ్‌సింగ్‌ కుడికాలు, చేతిపై దూసుకుపోవడంతో అక్కడే కిందపడిపోయాడు. అనంతరం నిందితుడిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చైన్‌స్నాచర్‌ దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సూలదేవనహళ్లిపోలీసులు చైన్‌స్నాచర్లు వినియోగించిన పల్సర్‌బైక్‌. యలహంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అపహరించిన బంగారుచైన్, చాకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో చైన్‌స్నాచర్‌ రాజేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు రామ్‌సింగ్‌పై బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయని పోలీసులు తెలిపారు.  గ్యాంగ్‌లో రామ్‌సింగ్‌ కీలకవ్యక్తి అని డీసీపీ చేతన్‌సింగ్‌రాథ్‌డ్‌ తెలిపారు.

1/1

బావరియా గ్యాంగ్‌ వినియోగించిన పల్సర్‌బైక్

Advertisement
Advertisement