
పట్నా : బిహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ జిల్లాలోని షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆదివారం విచారణను చేపట్టింది. ముజ్‌ఫర్‌పూర్‌లోని బాలికా గృహంలో చిన్నారులపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులపై వసతి గృహం అధికారులు, ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహించే చిల్డ్రన్ హోం అధికారులు, సిబ్బంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు.
ముంబయికి చెందిన ఓ సంస్థ షెల్టర్ హోంలో చేపట్టిన సోషల్ ఆడిట్ ఆధారంగా బిహార్ సాంఘిక సంక్షేమ శాఖ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. షెల్టర్ హోంలో బాలికలు తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో బాలిక గృహంను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారులు అక్కడి బాలికలను పట్నా, మధుబని షెల్టర్ హోంకు తరలించారు.
మత్తులో ముంచి..
షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై అధికారులు, సిబ్బంది సాగించిన అకృత్యాలు వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు మత్తు మందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడేవారని, ఓ బాలిక నిద్ర లేచి చూసే వరకూ వంటిపై దుస్తులు నేలపై పడిఉన్నాయని విలపించారు.
కొందరు చిన్నారులు లైంగిక వేధింపులను తప్పించుకునేందుకు తమ కాళ్లు, చేతులపై బ్లేడ్‌లతో కోసుకున్నామని గుర్తుచేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్టర్ హోం సిబ్బంది, హోంను నిర్వహించే బ్రజేష్ ఠాకూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.