ఫేక్‌ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే! | Sakshi
Sakshi News home page

జిగ్నేష్‌ మేవానీపై కేసు నమోదు

Published Sat, Jun 15 2019 5:47 PM

Case Filed On MLA Jignesh Mevani Over Sharing Of Fake Video - Sakshi

అహ్మదాబాద్‌ : నకిలీ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కారణంగా గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ చిక్కుల్లో పడ్డారు. నకిలీ వీడియోను షేర్‌ చేసి తమ పరువుకు భంగం కలిగించారన్న ప్రైవేటు పాఠశాల ఫిర్యాదుతో పోలీసులు శనివారం ఆయనపై కేసు నమోదు చేశారు. గత నెల 20న జిగ్నేష్‌ మేవానీ.. ఓ వ్యక్తి విద్యార్థిని కొడుతున్న వీడియోను ఓ తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. విద్యార్థిని అర్థనగ్నంగా నిలుచోబెట్టి.. చితకబాదుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోలో ఉన్నది ఆర్‌ఎమ్‌వీఎమ్‌ పాఠశాల ఉపాధ్యాయుడు అని జిగ్నేష్‌ పేర్కొన్నారు. అంతేగాకుండా.. ‘ ఈ పాఠశాలను మూసివేసి.. అందులోని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఇదంతా ఏంటి’ అంటూ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు.

ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ఇది గుజరాత్‌కు సంబంధించిన వీడియో కాదని..ఈజిప్టుకు చెందినది అని జిగ్నేష్‌కు తెలిపారు. దీంతో ఆయన వెంటనే తన ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆర్‌ఎమ్‌వీఎమ్‌ హెడ్‌ మాస్టర్‌ పోలీసులను ఆశ్రయించారు. తమ పాఠశాల పరువు తీశారంటూ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 505(2)(అసత్యాలు ప్రచారం చేయడం), 500(పరువునష్టం) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా గుజరాత్‌లోని వడ్‌గాం నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేసిన మేవానీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement