కానిస్టేబుల్‌పై రాజధాని రైతుల దాడి

Capital Farmers Attacked Constable Nagur - Sakshi

డ్రోన్‌తో చిత్రీకరించడంపై అభ్యంతరం

అడ్డుకున్న డీఎస్పీపై జేఏసీ, టీడీపీ నేతల ఆగ్రహం

సాక్షి, తుళ్లూరురూరల్‌ (తాడికొండ): రాజధాని రైతులు చేస్తున్న నిరసనలను డ్రోన్‌ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌ నాగూర్‌పై గురువారం రైతులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మందడం గ్రామంలో రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాలని ఉన్నతాధికారుల ఆదేశించడంతో నాగూర్‌ మందడం చేరుకున్నాడు. డ్రోన్‌ పని తీరును పరిశీలిస్తున్న క్రమంలో నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. దీంతో కానిస్టేబుల్‌ తన వద్ద ఉన్న మ్యాన్‌ప్యాక్‌ సహకారంతో పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరిస్తూ పారిపోయేందుకు యత్నించగా రైతులు పట్టుకుని కొట్టారు.

ఇంతలో స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు అక్కడకు చేరుకుని అతనిని కాపాడే ప్రయత్నం చేశారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు రైతులను గుర్తించారు. ఇంతలో జేఏసీ నాయకులు రైతులను తీసుకువెళ్లడానికి వీలులేదని అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. మహిళా రైతుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరింపజేసిన తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు.  
 
రహదారులపై ఆందోళనలు 
రాష్ట్ర రాజధాని కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులపై కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ గురువారం తుళ్లూరు మండలం మందడం గ్రామ రైతులు ప్రధాన రహదారులపై బైఠాయించి నిరసనలు తెలిపారు. రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఎలాంటి సర్వేలు, కేటాయింపులు చేయకూడదని బుధవారం కృష్ణాయపాలెం వద్ద రైతులు దుగ్గిరాల ఎమ్మార్వో మల్లీశ్వరికి విన్నవించుకున్నారు తప్ప ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పారు. తహసీల్దార్‌ను అడ్డుకున్నారంటూ 400 మందికి పైగా రైతులపై కేసులు కట్టడం దారుణం అన్నారు. తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం గ్రామాల్లోని శిబిరాల్లో గురువారం రైతులు ఆందోళనలు నిర్వహించారు.

అడ్డగింత, దాడులకు పాల్పడిన వారిపై కేసులు
మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో గురువారం ఓ సదస్సుకు హాజరై తిరిగి వెళుతున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను అడ్డుకున్న వారిపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. మందడం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారిపై దాడి, అలాగే డ్రోన్‌ కెమెరా ద్వారా ఆందోళన కారుల నిరసనలను చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి కూడా కేసులు నమోదు చేసినట్టు వివరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top