స్క్రాప్‌ గోదాంలో పేలుడు

Blast In Chemical Godown Near Rajendra Nagar - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: కెమికల్‌ డబ్బాల పేలుడుతో సీఐ, ఎస్సైతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. రాజేంద్రనగర్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి.. శాస్త్రీపురంలో యాకత్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ మోహిద్‌ స్క్రాప్‌ గోదాం నిర్వహిస్తున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కెమికల్‌ డబ్బాలను సేకరించి ఈ గోదాంలో శుభ్రపరుస్తుంటారు. శుభ్రపరిచిన ఈ డబ్బాలను తిరిగి విక్రయిస్తారు. 5, 10, 20, 25 లీటర్ల డబ్బాలతో పాటు ప్లాస్టిక్‌ డ్రమ్ములను శుభ్రపరిచి విక్రయించడం ఇతడి వ్యాపారం. ఇందులో పది మంది యువకులు పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక కెమికల్‌ డబ్బా పెలింది. ఈ సంఘటనలో హసన్‌నగర్‌కు చెందిన అప్రోజ్‌(25)కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు మోకాళ్ల వరకు నుజ్జునుజ్జయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే యజమాని పారిపోయాడు. స్థానికులు, తోటి కార్మికులు అప్రోజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఉస్మానియాలో అప్రోజ్‌ కాలును శాస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ విషయమై స్థానికులలు ఎంఐఎం నాయకుడు రహమత్‌బేగ్, శాస్త్రీపురం కార్పొరేటర్‌ మిస్బావుద్దీన్‌లకు సమాచారం అందించారు. స్థానికులంతా కలిసి గోదాం ఎదుట గురువారం ఉదయం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో కార్పొరేటర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యగౌడ్, ఎస్సై నదీమ్‌ సిబ్బందితో గోదాం వద్దకు చేరుకుని లోపల పరిశీలిస్తుండగా ఆ సమయంలో మరో కెమికల్‌ డబ్బా పేలింది. దీంతో సీఐ, ఎస్సై, కార్పొరేటర్‌తో పాటు రహమత్‌బేగ్, సయ్యద్‌ హబీబ్‌లకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే అపోలోతో పాటు అస్రా ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఏసీపీ ఆశోకచక్రవర్తి పరిశీలించారు. గోదాంను సీజ్‌ చేశారు.  కాగా, గోదాం పరిశీలించేందుకు వెళ్లిన సీఐతో పాటు నలుగురి కర్ణబేరీలకు దెబ్బతిన్నాయి. వారికి వినికిడి శక్తి తగ్గిపోయినట్టు తెలిసింది.   

గోదాములను తొలగించాలి 
శాస్త్రీపురంలో పలు గోదాంలు అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దాదాపు 25కు పైగా గోదాములు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రధాన రహదారిపైనే భారీ ప్లాస్టిక్‌ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, అనుకోని ప్రమాదం జరిగితే చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు నష్టం వాట్టిల్లే ప్రమాదం ఉందన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top