బెంబేలెత్తిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌

Blade Batch Attacks At Rajamahendravaram Are Overblown - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: నగరంలో బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రజలపై దాడులు చేసి వారి నుంచి సొమ్ములు కాజేస్తున్న ఈ బ్యాచ్‌ ఇప్పుడు పోలీస్‌ సిబ్బందిపై కూడా దాడులు చేస్తోంది. నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులు రెండు ముఠాలుగా ఏర్పడి హల్‌చల్‌ చేస్తున్నారు. ఆనంద్‌ నగర్, రాజేంద్ర నగర్, క్వారీ ప్రాంతం, కంబాల చెరువు, ఆదెమ్మదిబ్బ తదితర ప్రాంతాలలో 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న యువకులు బ్లేడ్‌ బ్యాచ్‌లుగా ఏర్పడ్డారు. గంజాయి, మద్యం తాగి ఆ మత్తులో సామన్యులపై దాడులు చేసి సొమ్ము, ఇతర వస్తువులు కాజేస్తున్నారు. ఇటీవల ఆనంద్‌ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ను అర్ధరాత్రి బెదిరించి రూ.15 వేలు విలువైన సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి చోరీకి పాల్పడుతున్నారు.
  
పోలీసుల పైనా దాడులు 
గతంలో త్రీటౌన్‌ ఎస్సైగా విధులు నిర్వహించిన సంపత్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులు ఇటుకలతో దాడి చేశారు. ఈ నెల 21వ తేదీ ఆనంద్‌ నగర్‌ ఆటోస్టాండ్‌ వద్ద స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావుపై నడిరోడ్డుమీద దాడి చేశారు. అక్కడి ఆటోడ్రైవర్లు వారిస్తున్నప్పటికీ వీరంగం సృష్టించారు. కొద్దిసేపటికి అదే ప్రాంతంలో కత్తులతో హడావుడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆనంద్‌ నగర్‌లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సారా వ్యాపారం, వ్యభిచారం, గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

రాజకీయ అండదండలు 
బ్లేడ్‌బ్యాచ్‌ ముఠాలకు రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్న వెంటనే.. వారిని వదిలెయ్యాలని రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎప్పుడూ గంజాయి, మద్యం మత్తులో ఉండే బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు అవసరమైతే హత్యలు కూడా చేసేందుకు వెనుకాడరు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం స్థానికులు సైతం హడలిపోతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top