‘మెరుగు’ మోసగాళ్లు దొరికారు..

Bihar Gang Arrest in Vizianagaram - Sakshi

పోలీసుల అదుపులో ఐదుగురు బీహార్‌ గ్యాంగ్‌ సభ్యులు

విజయనగరం , పార్వతీపురం/ గరుగుబిల్లి: బంగారానికి మెరుగు పెడతామని పట్టణంలోని ఇద్దరు మహిళలను మోసం చేసి 13 తులాల బంగారంతో పాటు నగదును ఎత్తుకొని పరారైన మోసగాళ్లను పట్టణ ఎస్సై యు. మహేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా  పట్టుకున్నారు.   ఎస్సై మహేష్‌ ఆదివారం తెలియజేసిన వివరాల ప్రకారం.. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పట్టణంలోని సంకావీధిలో గల అత్తాకోడళ్లు కాంతరత్నం, అనూషల ఇంటికి వచ్చిన మోసగాళ్లు బంగారానికి మెరుగుపెడతామని చెప్పి 13 తులాల బంగారంతో ఉడాయించారు.

ఇదిలా ఉంటే పట్టణంలోని మేదరవీధిలో గల పడాల నారాయణరావు ఇంటిలో బీహార్‌ రాష్ట్రానికి చెందిన కొంతమంది వ్యక్తులు అద్దెకు ఉంటున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం పది గంటలకు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు కాంతరత్నం, అనూషల నుంచి బంగారం కాజేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులు దినేష్‌కుమార్, సంతోష్‌కుమార్‌ యాదవ్‌లతో పాటు గరుగుబిల్లి మండలం రావివలసలో ఒక గృహిణిని మోసం చేసి దొరికిపోయిన గంగాకుమార్, సుభాస్‌కుమార్, ఇంద్రిజిత్‌ యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిందితుల నుంచి 51 గ్రాములు కరిగించిన బంగారాన్ని, నైట్రిక్, హ్రైడోక్లోరిక్‌ యాసిడ్‌తో పాటు బంగారం శుద్ధి చేసే పౌడర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు తెలియజేయండి...
ఎవరైనా అపరిచిత వ్యక్తులు తారసపడినా..అద్దె కొరకు ఇళ్ల కోసం వచ్చినా తమకు తెలియజేయాలని ఎస్సై మహేష్‌ కోరారు. మెరుగు పెడతామంటూ వచ్చేవారిని నమ్మవద్దని సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top