శ్రీకాకుళంలోనే బరాటం రమేష్‌ ఉన్నాడా?

Baratam Ramesh Hide in Srikakulam - Sakshi

వ్యక్తమవుతున్న అనుమానాలు

ఎగ్గొట్టిన సొమ్ము బినామీల పేరిట జమ!

శ్రీకాకుళం రూరల్‌: రూరల్‌ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బరాటం రమేష్‌ శ్రీకాకుళంలోనే తలదాచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాక్షిలో ప్రచురితమైన చీటింగ్‌ వార్తతో ఆమదాలవలస పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు, చేతివృత్తిదారులు, ఇతరత్రా బాధితులంతా గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద ప్రాంసరీ నోటు ఆధారంగా తీసుకున్న నగదు, చీటీల సొమ్మును మరోసారి లెక్కించే పనిలో పడ్డారు. నిందితుడు రాసిచ్చిన బాండ్లు, ప్రాంసరీ నోట్లు పట్టుకుని గురువారం రూరల్‌ పోలీసులను ఆశ్రయించనున్నారు. వీటిన్నింటినీ లెక్కిస్తే రూ.5 కోట్లకుపైనే టోకరా వేసినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ములో కొంత మొత్తం తనకు ఆప్తులైన పొన్నాడలో బినామీల పేరిట జమ చేసినట్లు సమాచారం.  

జల్సారాయుడు...  
బాధితుల సొమ్ముతో రమేష్‌ జల్సాలు చేసేందుకు ఎక్కువగా ఖర్చు పెట్టేవాడని గ్రామస్తులు అంటున్నారు. ప్రధానంగా ఖరీదైన దుస్తులతోపాటు ఇతర ఆడంబరాలకు వెచ్చించేవాడు. తీర్థ యాత్రల కోసం విమానాల్లో షికార్లు చేసేవాడు. గతేడాది డిసెంబర్‌లో షిర్డీ తీర్థయాత్రకు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి 23 మందితో ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చినట్లు తెలిసింది.   

పొన్నాడలో అత్తవారు..
రమేష్‌ అత్తవారు ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఉంటున్నారు. ప్రస్తుతం వీరి వద్దనే అతడి పిల్లలు చదువుకుంటున్నారు.
అయితే నిందితుడితోపాటు ఆయన భార్య సెల్‌ఫోన్లు వారం రోజులుగా పనిచేయడం లేదు. పొన్నాడలో బంధువులను విచారిస్తే, ఆచూకీ తెలుస్తుందని గూడెం గ్రామస్తులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top