తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!

Banjarahills Couple Victims Release Another Video on Police - Sakshi

మరో వీడియో విడుదల చేసిన ‘బంజారాహిల్స్‌ బాధితులు’

పోలీసులపై తాను తప్పుడు ఆరోపణలు చేశామని అంగీకారం

అట్లూరి సురేష్‌కుమార్‌పై రెండు రాష్ట్రాల్లో 11 క్రిమినల్‌ కేసులు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఠాణాలోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు... నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు’... అంటూ బంజారాహిల్స్‌ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్‌కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం బయటపెట్టారు. తాము ఉద్దేశపూర్వకంగానే ఆ ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని అంగీకరిస్తూ బుధవారం మరో వీడియో విడుదల చేశారు. సురేష్‌ నేరచరిత్రను హైదరాబాద్‌ పోలీసులు తవ్వుతున్న నేపథ్యంలోనే వీరు తప్పు ఒప్పుకున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సురేష్‌కుమార్‌ గతంలో విజయవాడలోని పడమట పోలీసుస్టేషన్‌ పరిధిలో నివాసం ఉండేవాడు. అప్పట్లో సన్‌ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. 2011 నుంచి 2013 మధ్య అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకుని మోసం చేయడంతో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 2007లో ఆయా కేసుల్లో ఇతడికి మూడేళ్ల జైలు శిక్ష పడటంతో ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించి బెయిల్‌ పొందాడు. ఆపై ఇతడిపై అక్కడే అత్త, మరదలు సైతం కేసు పెట్టారు.

హైదరాబాద్‌కు వచ్చిన సురేష్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలో ఓ స్థలం లీజుకు తీసుకుని గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టడంతో గత మార్చిలో జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.13లోని అడ్రస్‌ ఇన్‌ హోటల్‌లో రెస్టారెంట్‌ నిర్వహణ కోసం గతంలో దాని యజమాని వాసుదేవశర్మతో ఒప్పందం చేసుకున్నారు. రెస్టారెంట్, కిచెన్‌ అభివృద్ధి పేరుతో ఆయన నుంచి రూ.4.72 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో బాధితుడు మే నెల్లో బంజారాహిల్స్‌ ఠాణాలో చేశారు. దీని పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు విషయం కోర్టులోనే తేల్చుకోవాలని ఇరు పార్టీలకు చెప్పి పంపారు. వాసుదేవ శర్మ కోర్టును ఆశ్రయించగా సురేష్‌కు సమన్లు జారీ అయ్యాయి. వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించిన సురేష్‌ ఉద్దేశపూర్వకంగా వాసుదేవ శర్మపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. దీన్ని తీసుకోవడానికి పోలీసులు అంగీకరించకపోవడంతో వారితో దురుసుగా ప్రవర్తించడంతో సురేష్‌ పైనే కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయిన భార్యభర్తలు బెయిల్‌పై వచ్చి రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు స్టేషన్‌లోనే అత్యాచార యత్నం జరిగిందని, తమను దారుణంగా హింసించారని ఇరువురూ దాదాపు 15 నిమిషాల నిడివితో కూడిన వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీయడంతో పాటు సురేష్‌ గతాన్ని తవ్వితీశారు. దీంతో మెట్టు దిగిన ‘బాధితులు’ అసలు విషయం అంగీకరిస్తూ బుధవారం 1.5 నిడివితో మరో వీడియో విడుదల చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top