టిక్‌టాక్‌లో చూసి శివకుమార్‌ ఫిదా.. కానీ

Bangalore Entrepreneur Cheated by Tik Tok girlfriend vijaya lakshmi - Sakshi

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన యువతి

బెంగళూరు : టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన యువతికి ఓ యువకుడు రూ. లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన శివకుమార్‌కు టిక్‌టాక్‌ ద్వారా విజయలక్ష్మీ అనే మహిళ పరిచయం అయింది. దీంతో శివకుమార్‌ ఫిదా అయ్యారు.  ఆమె మొబైల్‌ నంబర్‌ తీసుకుని ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా చాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. వీరి స్నేహం ప్రేమగా మారింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు ఒకే ఇంటిలో సహ జీవనం కూడా మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి శివకుమార్‌ దగ్గర రూ. లక్షలు డబ్బులను తీసుకుని విజయలక్ష్మీ పరారైంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో హత్య చేస్తానంటూ బెదిరించినట్లు శివకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీజీహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

పట్టుబడ్డ బిల్డప్‌ బాబాయ్‌!
ఐఏఎస్‌ అధికారి అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని తహసీల్దార్‌ సమయస్పూర్తితో పట్టించిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. మహమ్మద్‌ సల్మాన్‌ (37) అరెస్టయిన నకిలీ ఐఏఎస్‌ అధికారి. నిందితుడు ఇన్నోవా కారుపై కర్ణాటక సర్కార అని రాసుకుని ఇద్దరు గన్‌మ్యాన్‌లను వెంటబెట్టుకుని తిరుగుతూ తాలూకాలకు వెళ్లి ప్రభుత్వ అధికారుల చేత పనులు చేయించుకోవడంతోపాటు రాజభోగాలు అనుభవించేవాడు. శుక్రవారం సాయంత్రం మహ్మద్‌ సల్మాన్‌ చెన్నపట్టణ ప్రభుత్వ అతిథిగృహంలో ఐఏఎస్‌ అధికారి హోదాలో దిగాడు.

ఈ విషయం కాస్త తహసీల్దార్‌ సుదర్శన్‌ చెవిన పడింది. దీంతో హుటాహుటిన ఒక బొకే తీసుకుని స్వాగతిద్దామని బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ సుదర్శన్‌ రెవెన్యూశాఖకు సంబంధించి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు వేయగా మహ్మద్‌ సల్మాన్‌ తడబడ్డాడు. దొరికిపోతాననే భయంతో గన్‌మ్యాన్‌లతో కలిసి పరారవుతుండగా వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సల్మాన్‌ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదేవిధంగా ఐఏఎస్‌ అధికారినని చెప్పుకుని తిరుగుతూ ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది. సల్మాన్‌తోపాటు ఇద్దరు గన్‌మ్యాన్‌లను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top