కారు ఢీకొని వీఆర్‌ఓ దుర్మరణం | Badhriraju Palem VRO Died in Car Accident Krishna | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వీఆర్‌ఓ దుర్మరణం

Feb 1 2019 1:11 PM | Updated on Feb 1 2019 1:11 PM

Badhriraju Palem VRO Died in Car Accident Krishna - Sakshi

ఘటనా స్థలిలో ప్రమాదానికి కారణమైన కారు మురళీకృష్ణ (ఫైల్‌)

కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు (పామర్రు): కారు ఢీకొన్న ఘటనలో మండలంలోని భద్రిరాజుపాలెం వీఆర్‌ఓ కాటూరి మురళీకృష్ణ (42) దుర్మరణం పాలయ్యారు. మండలంలోని యాకమూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం రెవెన్యూ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల ప్రకారం.. ఉయ్యూరు నుంచి విధులకు హాజరయ్యేందుకు తోట్లవల్లూరు వస్తున్న వీఆర్‌ఓ కాటూరి మురళీకృష్ణ (42) యాకమూరు శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు ఢీకొని మృతి చెందారు. గురువారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ ప్రమాదం వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.

భద్రిరాజుపాలెం వైపు నుంచి అతి వేగంగా ఉయ్యూరు వెళ్తున్న హోండా సిటీ కారు చెరకు లోడు ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో..  ఉయ్యూరు వైపు నుంచి తోట్లవల్లూరు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టడమే కాకుండా ఆ వెనుకనే సమీపంలో బైక్‌పై వస్తున్న వీఆర్‌ఓ మురళీకృష్ణను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో మురళీకృష్ణ తీవ్రంగా గాయపడగా, ఆయా కారుల్లో ప్రయాణిస్తున్న ఇరువురు స్వల్ప గాయాలకు గురైనట్లు తెలిసింది. మురళీకృష్ణను హుటాహుటిన విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఆయనకు భార్య దేవిశ్రీ, కుమారుడు హేమంత్‌ ఉన్నారు. ఉయ్యూరు మండలం కలువపాముల ఆయన స్వగ్రామం. ప్రమాద ప్రాంతాన్ని ఉయ్యూరు సీఐ కాశీవిశ్వనాథం, పమిడిముక్కల ఎస్‌ఐ శ్రీనివాస్, ఏఎస్‌ఐ నాంచారయ్య సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.

సహచరుల నివాళి..
అందరితో కలిసి మెలసి ఉంటూ, సౌమ్యునిగా పేరుగాంచిన వీఆర్‌ఓ మురళీకృష్ణ మృతితో  రెవె న్యూ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ జీ. భద్రు, డీటీ సాయిమహేష్, ఆర్‌ఐ ప్రసాద్, వీఆర్‌ఓలు ఘటనా ప్రాంతానికి తరలివెళ్లారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా మురళీ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement