చైన్ స్నాచర్లను పట్టించిన ‘గూగుల్‌ పే’ | Anjani Kumar Press Meet Over Chain Snatching Cases | Sakshi
Sakshi News home page

Jan 9 2019 5:30 PM | Updated on Jan 9 2019 7:19 PM

Anjani Kumar Press Meet Over Chain Snatching Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్బీ నగర్ పరిధిలో కలకలం సృష్టించిన వరుస చైన్‌ స్నాచింగ్‌ కేసును నగర పోలీసులు చేధించారు. చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను  పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మోను వాల్మీకి, చింతమల్ల ప్రణీత్‌ చౌదరి, చొకాలు ఉన్నారు. ఈ సందర్బంగా నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. గత నెలలో కలకలం సృష్టించిన వరుస చైన్‌ స్నాచింగ్‌ కేసును సీరియస్‌ పరిగణించామని.. ఈస్ట్‌, సౌత్‌, సెంట్రల్‌ జోన్‌ల పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారని వివరించారు.  ప్రణీత్‌ చౌదరి గూగుల్‌ పే ద్వారా నగదు లావాదేవీలు జరపడంతో వారిని అరెస్టు చేయడం సులువైందన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

21 వేల వాహనాలను తనిఖీ చేశాం
‘గత నెల 26, 27 తేదీల్లో 11 స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రత్యేక టీంను రంగంలోకి దింపి నిందుతులను పట్టుకున్నాం. అన్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాదాపు 21 వేల వాహనాలను తనిఖీ చేశాం. వాహనాల తనిఖీల్లో 1600 వాహనాలను సీజ్‌ చేశాం. 600 సీసీ పుటేజ్‌లు, వందల సంఖ్యలో లాడ్జ్‌లలో తనిఖీలు చేశాం.  పట్టుబడ్డ వారిలో కీలక వ్యక్తి చింతల ప్రణీత్‌ చౌదరి. రెండేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. మరో కీలక వ్యక్తి చొకా. ఇతడూ నేర చరిత్ర కలిగినవాడే. ’అంటూ అంజనీ కుమార్‌ పలు విషయాలను వెల్లడించారు. 
 

అసలేం జరిగిందంటే..
అంతరాష్ట్ర స్నాచర్లు పక్షం క్రితం రెండు రోజుల్లో  హల్‌చల్‌ చేశారు. 11 స్నాచింగ్స్‌ చేయడంతో పాటు మరో యత్నానికీ పాల్పడ్డారు. మొదటి రోజు ఉదయం మలక్‌పేటలో బైక్‌ (టీఎస్‌ 08 ఈపీ 4005) అద్దెకు తీసుకున్న వీరు అదే రోజు సాయంత్రం గంట వ్యవధిలో మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో ఐదు చోట్ల పంజా విసిరారు. అక్కడి నుంచి నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట వరకు వచ్చిన వీరు మళ్లీ వెనక్కు వెళ్లి చైతన్యపురి ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఆ రాత్రి ఓ లాడ్జిలో తలదాచుకున్న ఈ ద్వయం గురువారం ఉదయం నాగోల్‌లో ఓ స్నాచింగ్‌కు యత్నించింది. ఆపై 7 గంటలకు చైతన్యపురిలో మొదలెట్టి 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్‌ చేసింది. హయత్‌నగర్‌ నుంచి తిరిగి ఎల్బీనగర్‌ మీదుగా  సాగర్‌ రోడ్డు వరకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement