చేయి తడిపితేనే..  

ACB Traps EOPRD - Sakshi

ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతి

సిరులు కురిపిస్తున్న నూతన  మున్సిపాలిటీల ఏర్పాటు

పన్నులు పెరుగుతాయని ప్రజల్లో భయం

గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడే  అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు

ఇదే అదనుగా చేసుకున్న కార్యదర్శులు..

రూ.లక్షల్లో డిమాండ్‌  ఏసీబీకి పట్టుబడిన చౌటుప్పల్‌ ఈఓపీఆర్డీ 

మరికొందరిపైనా ఫిర్యాదులు.. ఏసీబీ నిఘా

సాక్షి, యాదాద్రి : నూతన మున్సిపాలిటీల ఏర్పాటు అధికారులకు సిరులు కురిపిస్తున్నాయి. నేటినుంచి కొత్త మున్సిపాలిటీలు కొలువుదీరనుండడంతో ఆలోపే అందినకాడికి దండుకుంటున్నారు. వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నవారి నుంచి పోటీ పడి వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తూనే అంతకు రెట్టింపు స్థాయిలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది, మధ్యవర్తులుగా మారి భవన నిర్మాణాలు, వెంచర్ల అనుమతుల కోసం లక్షల రూపాయలు వసూలు చేశారు.

అనుమతుల కోసం క్యూ 

జిల్లాలో మేజర్‌గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆలేరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూర్‌ పట్టణాలను సమీప గ్రామాలతో కలిసి మున్సిపాలిటీలుగా మారాయి. దీంతో ఇళ్లు, భవన నిర్మాణాల కోసం జనం ఈఓల వద్దకు పెద్ద సంఖ్యలో క్యూకట్టారు. ఇదే అదనుగా ప్రజలనుంచి అనధికారికంగా లక్షల రూపాయలు దండుకున్నారు. ఈ క్రమంలోనే చౌటుప్పల్‌ ఈఓపీఆర్డీ, చౌటుప్పల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ భవన నిర్మాణ అనుమతికోసం రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం జిల్లాలో కలకలం రేపింది.

జిల్లాలో అనుమతుల పేర జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో ఉన్నతస్థా యి అధికారులు విఫలమయ్యారా లేక వారితో భా గస్వాములు అయ్యారా.. అన్న అనుమానం ప్రజ ల్లో వ్యక్తమవుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తుండగా కొందరు అధికారులు మాత్రం అక్రమాలకు పాల్పతుం డడం ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు వస్తోంది. 

ప్రత్యేకంగా వచ్చాడు

చౌటుప్పల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా నర్సిరెడ్డి జూలై 16నుంచి విధుల్లో చేరారు.ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి ఈయనను ప్రత్యేకంగా రప్పించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఉన్న రెగ్యులర్‌ కార్యదర్శి అంజన్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం లేదని ఓ ప్రజాప్రతినిధి తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

అనంతరం తనకు అనుకూలమైన అధికారిని సదరు ప్రజాప్రతినిధి ఇన్‌చార్జి కార్యదర్శిగా నియమించడంలో విజయం సాధించారు. ఇంకేముంది ఉన్నది 15 రోజులే కాబట్టి ఆలోపే అందినంత దండుకోవాలన్న ఎజెండాతో పని చేశాడు నర్సిరెడ్డి. ఈఓపీఆర్డీగా మండల పరిషత్‌లో సంతకం చేసి ఇన్‌చార్జి కార్యదర్శిగా చౌటుప్పల్‌ పంచాయతీకి వెళ్లేవారు. 

ప్రజల అవసరాలను అదునుగా భావించి..

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కావడంతో పన్నులు పెరుగుతాయన్న భయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం నర్సిరెడ్డి వద్దకు క్యూకట్టారు. ఆయన ఇదే అదునుగా భావించి తన అనుచరుల ద్వారా ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఇవ్వడం కోసం రూ.లక్షల్లో బేరాలు కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వని వారికి కొర్రీలు పెట్టి తన చుట్టూ తిప్పుకునేవాడు.

మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు మాట్లాడి వారి ద్వారా వసూలు చేశారు. గత నెల 30, 31తేదీల్లో నర్సిరెడ్డి సెలవు పెట్టి చౌటుప్పల్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దాబాల్లో కూర్చుని బేరాలు సాగించాడు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం సుమారు 20 మంది వరకు డబ్బులు లంచాలుగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఏసీబీకి పట్టుబడటంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.

ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాగే అనుమతుల కోసం వెంచర్లలో ప్లాట్లను తమ బినామీల పేర్ల రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏసీబీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబును ఇదే స్థాయిలో వేదించాడు.  భవన నిర్మాణ అనుమతి కోసం రూ.2లక్షలు డిమాండ్‌ చేయగా రూ.70వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మొత్తాన్ని బుధవారం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు.

పన్నులపై ప్రజల్లో అవగాహన లేమి

మున్సిపాలిటీలో మూడేళ్ల వరకు పన్నులు పెంచడం లేదని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విష యం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు ఈవిషయంపై అవగాహన లేక పన్నులు పెరుగుతాయన్న భయంతో అనుమతుల కోసం ఎగబడుతున్నారు. మున్సిపాలిటీలుగా మారుతున్న చౌటుప్పల్, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్టల్లో భూములకు ధరలు అధికంగా ఉన్నాయి.

వాటి ఆధారంగా పన్నులు పెరిగితే అనుమతుల కోసం అధికంగా ఫీజులు చెల్లించాల్సి వస్తుందని ముందుగానే పంచాయతీ కార్యదర్శులు, మధ్యవర్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో జనం పెరిగే పన్నులను అతిగా ఊహించుకుని అమనుతుల కోసం అధికారుల వద్దకు క్యూ కట్టారు. ఇది వారికి కాసులను కురిపించింది. 

గతంలోనూ ఏసీబీకి చిక్కిన కొందరు అధికారులు

గతంలో భువనగిరి మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడానికి రూ.50వేలు లంచం తీసుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే ట్రాన్స్‌కోకు చెందిన భువనగిరి రూరల్‌ ఏఈ, లైన్‌మెన్‌లు లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబట్టారు. బస్వాపురం వీఆర్వో, యాదగిరిగుట్ట తహసిల్దార్, ఆర్‌ఐ, ఆలేరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు, రాజాపేట మండలం బొందుగుల వీఆర్‌ఓ ఇలా పలువురు అధికారులు సుమారు 20మంది వరకు యాదాద్రిభువనగిరి జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.

మరికొందరిపై ఏసీబీ నిఘా!

జిల్లాలో మరికొందరిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సబ్‌ట్రెజరీ, రిజిస్ట్రేషన్‌లు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, టౌన్‌ప్లానింగ్‌ అధికారుల పనితీరుపై ఇటీవల పలు ఫిర్యాదులు వస్తున్నాయి. భూముల రి జిస్ట్రేషన్‌ల కోసం సబ్‌ట్రెజరీ అధికా రులు, భూ రికార్డుల ప్రక్షాళనలో పాస్‌బుక్కులు, భూముల ఆస్తి మార్పిడి కోసం, రెవెన్యూ అధికారులు, గొ ర్రెల పంపిణీలో డాక్టర్లు, వెంచర్లకు అనుమతులు ఇవ్వడం కోసం టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, పం చాయతీరాజ్‌ అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఏసీబీ నిఘా పెట్టింది. తాజాగా పంచాయతీరాజ్‌ ఉద్యోగి పట్టుబడటంతో జిల్లాలోని పలువురు ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top