ఏసీబీ వలలో సివిల్‌ సప్లయీస్‌ అధికారి

ACB Raids On Civil Supply Officer In West Godavari - Sakshi

ఏలూరు, గోపాలపురంలో రూ.3 కోట్లకుపైగా అక్రమాస్తులు

300 గ్రాముల బంగారు అభరణాలు, నగదు స్వాధీనం

బ్యాంకు లాకర్లు, ఆస్తుల వివరాల సేకరణ

ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ వెల్లడి

ఏలూరు టౌన్‌ : జంగారెడ్డిగూడెంలోని ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లయీస్‌ గోడౌన్‌ (మండల స్థాయి స్టాక్‌పాయింట్‌) ఇన్‌చార్జిగా పనిచేస్తున్న దొడ్డిగర్ల మునేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏకకాలంలో ఏలూరులో రెండు చోట్ల, గోపాలపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సీఐ యూజే విల్సన్, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంకు చెందిన నలుగురు ఏసీబీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. మునేశ్వరరావు ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మునేశ్వరరావు కార్యాలయంలోనూ మరో మూడు చోట్ల దాడులు చేశారు.

ఈ దాడుల్లో మునేశ్వరరావు సుమారుగా రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగిఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు, ఇతర పత్రాలు ఏవైనా ఉన్నాయేమోనని అధికారులు సోదాలు చేస్తున్నారు. మునేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ గోపాలకృష్ణ చెప్పారు. ఏలూరు విద్యానగర్‌లోని మునేశ్వరరావు ఇంటిలోనూ, విద్యానగర్‌లో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ వద్ద, అతని అత్తగారి ఇల్లు గోపాలపురంలోనూ, జంగారెడ్డిగూడెం కార్యాలయంలోనూ ఏకకాలంలో దాడులు చేశారు. ఏలూరు విద్యానగర్‌ ఇంటిలో 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.7లక్షల నగదు గుర్తించగా, విద్యానగర్‌లో రూ.2 కోట్లకు పైగా మార్కెట్‌ విలువ చేసే అపార్టుమెంట్‌ను అధికారులు గుర్తించారు. అదేవిధంగా గోపాలపురంలోనూ 8 ఎకరాల పొలం ఉన్నట్లు అధికారులు గుర్తించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురంలోని పొలం ఒక్కో ఎకరం సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకూ ధర పలుకుతుందని తెలుస్తోంది.  మునేశ్వరరావు బ్యాంకు లాకర్లను, ఇతర ప్రాంతాల్లోనూ ఇంకా ఏమైనా ఆస్తులు, బంగారు ఆభరణాలు ఉన్నాయేమో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మునేశ్వరరావుపై కేసు నమోదు చేశామనీ, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.

గోపాలపురం పెద్దగూడెంలో...
గోపాలపురం : గోపాలపురం పెద్దగూడెంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రాజమండ్రి ఏసీబీ సీఐ వి.పుల్లారావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సివిల్‌ సప్లయీస్‌ గోదాము ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దొడ్డిగర్ల మునేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏలూరు ఏసీబీ అధికారులు కేసు పెట్టినట్లు చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం మునేశ్వరరావు అత్త జి.శేషమ్మ ఇంటిలో సోదాలు నిర్వహించినట్లు సీఐ చెప్పారు. ఇంటిలో ఎటువంటి డాక్యుమెంట్లు, నగదుకాని దొరకలేదన్నారు. జంగారెడ్డిగూడెం, ఏలూరు, గోపాలపురంలలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈయన వెంట రాజమండ్రి ఏసీబీ సిబ్బంది జానీ, సత్యవతి, ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెంలో...
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ (ఎంఎల్‌ఎస్‌) లో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మునేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ సీఐ సూర్యమోహన్‌రావు తెలిపారు. ఏలూరు, గోపాలపురం, జంగారెడ్డిగూడెంలలో ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యాలయంలోని రికార్డులన్నీ తనిఖీచేసినట్లు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top