పైసలిస్తేనే...పనులు 

ACB Officers Checks Peddapalli ADA Krishna Reddy Assets - Sakshi

సాక్షి, పెద్దపల్లిరూరల్‌: పాలనా సౌలభ్యంకోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు పైసలిస్తేనే పనులు చేస్తున్నారు. బాధితులు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను కటకటాలకు పంపుతున్నారు. ఓ పక్క కేసులు నమోదవుతున్నా కొంతమంది అధికారుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదనేందుకు మూడునెలల వ్యవధిలో జిల్లాకేంద్రంలోనే నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనం. కొద్ది మాసాలక్రితం సబ్‌రిజిస్ట్రార్, ఇరిగేషన్‌ డీఈఈ, వీఆర్‌వోలు పట్టుబడగా.. తాజాగా వారంక్రితం (ఈ నెల 15న) పెద్దపల్లి డివిజన్‌ ఏడీఏ కృష్ణారెడ్డి విత్తన వ్యాపారికి లైసెన్స్‌ మంజూరుకోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వ్యవసాయశాఖలో ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా ఏసీబీ అధికారులకు ఏడీఏ చిక్కడంతో అది నిజమేనని పలువురు పేర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువుల విక్రయం కోసం కొత్త లైసెన్స్‌ జారీ చేయడం, పాత వాటిని రెన్యువల్‌ చేసేందుకు అధికారులు మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లా వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఇంకా కొందరి అధికారులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టిసారించి లోతుగా విచారణ సాగించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు వ్యవసాయాధికారులకు ఏసీబీ అధికారుల నుంచి పిలుపు వచ్చిందని సంబంధితశాఖ అధికార వర్గాల ద్వారా తెలిసింది.  

ఆదాయానికి మించిన ఆస్తులు
పెద్దపల్లి ఏడీఏగా పని చేస్తున్న కృష్ణారెడ్డి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులు రెండు, మూడురోజులుగా ఏడీఏ నివాసముండే వరంగల్‌లో ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కృష్ణారెడ్డి ఇంట్లో దాదాపు రూ.6 లక్షల మేర నగదుతోపాటు రూ.75 లక్షల ఫిక్స్‌డ్‌ బాండ్లు, సుమారు కిలో వరకు బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించి సీజ్‌ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బ్యాంకులో మూడు జంబో లాకర్లలో రూ.కోటి 30 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

సదరు ఏడీఏ కృష్ణారెడ్డిపై ఇప్పటికే అవినీతి కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా లభించిన ఆధారాలతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు ఓ అధికారి ధ్రువీకరించారు. దీంతో ఏడీఏ కృష్ణారెడ్డి  కేసు విచారణ సాగుతున్నందున వ్యవసాయశాఖలో పని చేస్తున్న వారిలో ఇంకా ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని పలువురు అధికారులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top