గేదెల దొంగతనం కేసు: ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై

ACB Caught Maheswaram Sub inspector While taking Bribe - Sakshi

సాక్షి, మహేశ్వరం: రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా మహేశ్వరం ఎస్‌ఐ జి. నర్సింహులును ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. గేదెల దొంగతనం కేసులో నిందితులపై కేసులు, సేక్షన్లను తగ్గించి చిన్న కేసులు పెట్టించి సురక్షితంగా బయటపడేవిధంగా చేస్తానని చెప్తూ.. నిందితుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. నర్సింహులును ఏసీబీ క్యాచ్‌చేసింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గతవారం రోజుల కిత్రం కల్వకోల్, నాగిరెడ్డిపల్లి, గొల్లూరు గ్రామాల్లో పొలం వద్ద పశువుల పాకలో కట్టేసిన గేదెలను దొంగలు అపహరించుకుపోయారు. గేదెలు పోయిన రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి ఈ దొంగతనం కేసును ఛేదించారు.

అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన రాజు పొలం వద్ద కట్టేసిన గేదెలను దొంగిలించాడని గుర్తించి పోలీస్‌ స్టేషన్‌ తీసుకొచ్చి విచారించారు. దొంగిలించిన గేదెలను మొయినాబాద్‌కు చెందిన సయ్యద్‌ నజీర్, ఖలీద్‌కు సర్ధార్‌నగర్‌ సంతలో విక్రయించానని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులు నజీర్, ఖలీద్‌లను పట్టుకొని విచారించడంతో.. కొనుగోలు చేసిన గేదెలను సంగారెడ్డికి చెందిన గేదెల వ్యాపారి హర్షద్‌కు విక్రయించామని వారు తెలిపారు. ఈ దశలో ఎస్‌ఐ నర్సింహులు కేసును తన చేతిలోకి తీసుకొని గేదెల దొంగతనం చేసిన రాజు, కొనుగోలు చేసిన సయ్యద్‌ నజీర్, ఖలీద్, హర్షద్‌లను పోలీసులకు స్టేషన్‌కు తీసుకొచ్చి బెదింపులకు దిగాడు. ముగ్గురిపైన కేసులు, సేక్షన్‌న్లు నమోదుచేసి ఇబ్బందులకు గురి చేస్తానని బెదిరించాడు. అడిగినవన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని, బెయిల్‌ రాకుండా చేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన గేదెల వ్యాపారి సయ్యద్‌ నజీర్‌.. ఎస్సై లక్ష రూపాయలు డిమాండ్‌ చేస్తే రూ. 60 వేలు ఇచ్చాడు. చోరీ కేసులో ఉన్న మరో గేదెల వ్యాపారి హర్షద్‌ను రూ. 1.10 లక్షలు ఇస్తే నామమాత్రం కేసులు పెట్టి వదిలేస్తానని, ఇవ్వకపోతే పెద్దకేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించడంతో అంత డబ్బులు తాను ఇవ్వలేను రూ. 80 వేల రూపాయాలు ఇస్తానని.. తనను తప్పించండి సార్‌ అని బతిమాలాడుకున్నాడు.

గురువారం పోలీస్‌ స్టేషన్‌ వచ్చి నేరుగా మీకే డబ్బులు ఇస్తానని ఎస్‌ఐకి చెప్పాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న లంచగొండి ఎస్‌ఐ నర్సింహులును ఏసీబీ అధికారులకు పట్టించి తగిన బుద్ధి చెప్పాలని హర్షద్‌ నిర్ణయించుకున్నాడు. గురువారం ఉదయం నాంపల్లిలో ఉన్న ఏసీబీ అధికారులను హర్షద్‌ ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ముందుగానే ప్రణాళిక వేసుకొని హర్షద్‌ చేతికి కెమికల్‌ రుద్దిన రెండు వేలనోట్లతో కూడిన రూ. 80 వేలు ఇచ్చి ఎస్‌ఐ నర్సింహులు వద్దకు పంపారు. ఎస్‌ఐ నర్సింహులు హర్షద్‌ వద్ద నుండి రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా ఎస్‌ఐ నర్సింహులు , డబ్బులను పట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top