వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

5 People Died With Suicide In Nizamabad - Sakshi

నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు విద్యార్థి కాగా ఇద్దరు యువకులు, ఓ వృద్ధుడు, మరో వివాహిత కూడా ఉన్నారు. వేర్వేరు కారణాలతో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సాక్షి, నిజాంసాగర్‌(నిజామాబాద్‌) : మండలంలోని అచ్చంపేట మోడల్‌ పాఠశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గాండ్ల మౌనిక(17) అనే విద్యార్థిని సోమవారం రాత్రి ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాండ్ల నాగభూషణం రెండో కుమార్తె అయిన మౌనిక అచ్చంపేట ఇంటర్‌ చదువుతోంది. కాగా గత 15రోజులుగా మౌనికకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు కడుపునొప్పితో బాధపడుతోంది. బాన్సువాడ, పిట్లంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించినా కడుపునొప్పి తగ్గక మనస్థాపానికి గురైన జీవితంపై విరక్తి చెందింది. సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్‌ విద్యార్థిని మృతిపై మోడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, టీచర్లు, విద్యార్థులు నివాళి అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు.  

తండ్రి మందలించాడని ఒకరు.. 
కామారెడ్డి క్రైం: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వాంబే కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ గోవింద్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్లా(23) స్థానికంగా టైలరింగ్‌ షాపులో పని చేస్తాడు. కొద్దిరోజులుగా అతడు పనికి వెళ్లడం లేదు. దీంతో అతడి తండ్రి పనికి వెళ్లాలని మందలించాడు. మనస్తాపం చెందిన అబ్దుల్లా ఇంట్లో సిలింగ్‌రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలాన్ని పట్టణ పోలీసులు పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

చౌట్‌పల్లి శివారులో యువకుడు 
కమ్మర్‌పల్లి(బాల్కొండ): మండలంలోని చౌట్‌పల్లి శివారులో గల లక్ష్మాపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ ఆసిఫ్‌ మహ్మద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌట్‌పల్లికి చెందిన వేల్పూర్‌ రవి(30) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం పవిత్ర అనే మహిళతో వివాహం కాగా ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. వీరి సంసారంలో గొడవలు ప్రారంభమై భార్యభర్తలు తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో రవి బయటకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న గ్రామస్తులకు లక్ష్మాపూర్‌ అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం కనిపించింది.

పోలీసులకు సమాచారం అందించగా, ఎస్‌ఐ ఆసిఫ్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వేల్పూర్‌ రవిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలిన గాయాలుండడంతో రవిది ఆత్మహత్యనా, హత్యనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో క్లూస్‌ టీం సభ్యుల బృందాన్ని ఘటన స్థలానికి రప్పించారు. క్లూస్‌ టీం సభ్యులు వివరాలను సేకరించారు. మద్యం సేవించి జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్‌ లేదా పెట్రోల్‌ పోసుకొని నిప్పంటిచుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్మూర్‌ ఏసీపీ అందె రాములు, భీమ్‌గల్‌ సీఐ సైదయ్య ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

భర్తతో గొడవపడి వివాహిత.. 
నస్రుల్లాబాద్‌: మండలంలోని అంకోల్‌ గ్రామానికి చెందిన కుర్మ సాయవ్వ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిందని ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. సాయవ్వ తన భర్తతో గొడవ పడిందని దీంతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుందన్నారు. వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ మరణించిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. సాయవ్వకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు.     

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం రైల్వే పోలీసులు తెలిపారు. నగరంలోని రాజీవ్‌నగర్‌కాలనీకు చెందిన సదానంద్‌గౌడ్‌(60) వృతిరీత్యా కల్లు వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం సదానంద్‌గౌడ్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటలకు రైల్వే పోలీసులకు రైలు పట్టాలపై ఓ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో ఉన్న డైరీలో ఫోన్‌నంబర్లకు ఫోన్‌ చేయగా అతడి చిరునామా తెలిసింది. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు విషయం తెలిపారు. కుటుంబ సభ్యులు రోదిస్తూ ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించారు. మంగళవారం ఉదయం మృతుడి భార్య శాంత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదానంద్‌గౌడ్‌ ఆత్మహత్యకు పాల్పడేంత ఇబ్బందులు ఏమి లేవని, ఆరోగ్య సమస్యలు కూడా లేవని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు తెలిపారు. దీనిపై విచారించాలని వారు పోలీసులను కోరారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top