కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

32 Injured In Bus Accident In Krishna District - Sakshi

జాతీయ రహదారిపై నుంచి 10 అడుగుల గోతిలో పడ్డ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 

10 మంది చిన్నారులతో సహా 32 మందికి గాయాలు

సాక్షి, అమరావతి బ్యూరో/పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : వేగంగా ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి గోతిలో బోల్తా పడ్డ సంఘటనలో పది మంది చిన్నారులతో సహా 32 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబ్‌పేట క్రాస్‌రోడ్స్‌ వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రమణ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు యానాం నుంచి ఆదివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరింది.

వేగంగా ప్రయాణిస్తూ నవాబ్‌పేట్‌ క్రాస్‌రోడ్స్‌ వద్దకు చేరుకోగానే అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న పది అడుగుల గుంతలో పడిపోయింది. బస్సులోని 44 మందిలో డ్రైవర్లు షేక్‌ వలీ, షేక్‌ సుభానీ, 10 మంది చిన్నారులు సహా మొత్తం 32 మందికి గాయాలయ్యాయి.  డ్రైవర్‌ వలీ బస్సులో ఇరుక్కుపోవడంతో గ్యాస్‌ కట్టర్స్‌ సాయంతో ఇనుప కడ్డీలు కట్‌ చేసి బయటకు తీశారు. గాయపడినవారిని 108 వాహనాల్లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి, తీవ్రంగా గాయపడినవారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో చిన్ని (11) పరిస్థితి విషమంగా ఉంది. మరో చిన్నారి కె.వేణు (12)కి ఛాతీలో గాయమైనట్టు గుర్తించి గుంటూరు తరలించారు. ప్రమాద స్థలాన్ని నందిగామ డీఎస్పీ బోస్‌  తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నబీ తెలిపారు. గతంలోనూ ఇక్కడికి కొద్ది దూరంలోనే జేసీ దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు గోతిలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెల 16న తెలంగాణ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు.  ట్రావెల్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్వల్పంగా గాయపడ్డవారు నందిగామ ఆస్పత్రిలో ధర్నాకుదిగారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top