ఒక హత్య.. వంద మంది పోలీసులు

100 Policemen investigation in Pregnant woman murdered - Sakshi

ఐటీ కారిడార్‌లో కలకలం రేపుతున్న గర్భిణి హత్య కేసు 

గచ్చిబౌలి : సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏ పోలీసును కదిపినా గర్భిని హత్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క హత్య కేసులో వందల మంది భాగాస్వాములు కావడం ఇదే తొలిసారి. రోజులు గడుస్తున్నా మిస్టరీని చేధించలేకపోయామని ఆవేదన వ్యక్తొం చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లో ఓ గర్భిణిని దారుణంగా హత్య చేయడమేగాక శరీరాన్ని ముక్కలు చేసి మూటల్లో  కట్టి పడేయంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య స్వయంగా ఈ హత్య కేసును పర్యవేక్షిస్తుండగా జాయింట్‌ కమిషనర్‌ షానవాజ్‌ ఖాసీమ్, మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్‌వోటీ, సీసీఎస్‌ బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి.  

పోలీసులకు సవాల్‌  
ఐటీ కారిడార్‌లో జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ మహేందర్‌ రెడ్డి త్వరితగతిన నిందితుల ఆచూకీ కనుగొనాలని సైబరాబాద్‌ కమిషనర్‌ను ఆదేశించడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మృతదేహం లభించిన 13 రోజుల అనంతరం సీసీ పుజేటీల ద్వారా కీలక ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంటున్నారు. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో ప్రయత్నాలు సాగుతున్నాయని, త్వరలోనే కేసును చేధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

వినూత్న దర్యాప్తు  
ఈ హత్య అంజయ్యనగర్, సిద్ధిఖీనగర్‌లో జరిగి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు  మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ గంగారెడ్డి నేతృత్వంలో ఈ నెల 8న మృతురాలి ఊహ చిత్రాలతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అంతరాష్ట్ర బస్సులకు, రైళ్లకు మృతురాలు ధరించిన దుస్తులు, మెట్టెలు, గాజుల ఫొటోలతో కూడిన కర పత్రాలను అంటించారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పీఎస్‌ల పరిధిలో మైక్‌ ద్వారా ప్రచారం చేశారు.  

విస్తృత తనిఖీలు 
అనుమానితులు సిద్ధిఖీనగర్‌ నుంచి వెళ్లినట్లు సీసీ పుటేజీల్లో గుర్తించిన నేపథ్యంలో సీపీ ఆదేశాల మేరకు సిద్ధిఖీనగర్, అంజయ్యనగర్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కమిషనరేట్‌లోని 36 పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తనిఖీల్లో పాల్గొన్నారు.  ఆదివారం తెల్లవారు జామున పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో కలకలంరేగింది.  రెండు బస్తీల్లో ఎటువైపు చూసిన పోలీసులే కనిపించారు. నిద్రపోతున్నవారిని కూడా లేపి అనుమానితుల ఫొటోలు, వీడియోలు చూపించారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు, అద్దెకు ఉండే వారి వివరాలను తెలుసుకున్నారు. గర్భిణి హత్య కేసుపై ఇప్పటికే తెలిసి ఉండటంతో కొందరు స్థానికులు పోలీసులతో పాటు ఇంటింటికి తిరిగి సహకరించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top