ఈత సరదా ప్రాణం తీసింది.. | బాలుడు నీటి కాలువలో మరణించాడు | Sakshi
Sakshi News home page

ఈత సరదా ప్రాణం తీసింది..

Apr 11 2018 12:06 PM | Updated on Jul 12 2019 3:02 PM

బాలుడు నీటి కాలువలో మరణించాడు - Sakshi

మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు రాజు, ధనలక్ష్మి.

బిక్కవోలు (అనపర్తి): స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తూ నీటి మునిగి చనిపోయాడు. మంగళవారం బిక్కవోలులో ఈ సంఘటన జరిగింది. స్థానికులు.. బంధువుల కథనం ప్రకారం.. కార్పెంటర్‌గా పనిచేసే ఉద్దండం రాజు కుమారుడు చైతన్య దుర్గాప్రశాంత్‌(11) స్థానిక ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.

ఒంటిపూట సెలవులు కావడంతో సాయంత్రం స్నేహితులతో కలసి ప్రశాంత్‌ దగ్గరలో ఉన్న సామర్లకోట కాలువలో ఈతకు వెళ్లాడు. సరిగా ఈత రాని ప్రశాంత్‌ కాలుజారి లోతుకు పోవడంతో మునిగిపోయాడు. దీంతో తోటి పిల్లలు కేకలు వేయడంతో అటుగా వస్తున్న వారు మునిగిపోతున్న బాలుడిని పైకి తీశారు.

అప్పటికే దుర్గాప్రశాంత్‌ ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపించారు. రాజుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో రోదిస్తున్న తల్లి ధనలక్ష్మిని ఆమె కుమార్తె ఓదారుస్తున్న తీరు చూపరులకు కంటితడి పెట్టించింది.

ఎంతో చలాకీగా ఉండే చైతన్య దుర్గాప్రశాంత్‌ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు, స్నేహితులు బోరున విలపించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement