తొలిసారి ఒకే వేదికపైకి టెలికాం ప్రత్యర్థులు | Three-day India Mobile Congress being held in New Delhi | Sakshi
Sakshi News home page

తొలిసారి ఒకే వేదికపైకి టెలికాం ప్రత్యర్థులు

Sep 27 2017 3:53 PM | Updated on Sep 27 2017 8:03 PM

Three-day India Mobile Congress being held in New Delhi

సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో పోటాపోటీగా దూసుకుపోతున్న దిగ్గజ అధినేతలు ముగ్గురూ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌, ఐడియా అధినేత కుమార్‌ మంగళం బిర్లాలు ఒకే వేదిక పైకి వచ్చారు. నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన ముఖేష్‌ అంబానీ, దేశీయ ఎకానమీ వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలో టాప్‌-3 ఆర్థికవ్యవస్థలో ఒకటిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం 2.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, వచ్చే 10 ఏళ్లలో 7 ట్రిలియన్‌ డాలర్లను అధిగమిస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సులోనే వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో విట్టోరియో కొలవో, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హాలు కూడా పాల్గొన్నారు. నేటి నుంచి సెప్టెంబర్‌ 29 వరకు ఈ సదస్సు జరుగనుంది. డేటా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆయిల్‌గా అభివర్ణించారు. వచ్చే 12 నెలల్లో 4జీ కవరేజ్‌ను విస్తరిస్తుందని, 2జీ వాడకాన్ని అధిగమిస్తుందని తెలిపారు. 

ఈ ఏడాది రూ.18వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లను ఎయిర్‌టెల్‌ పెట్టుబడి పెట్టే యోచనలో ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునిల్‌ మిట్టల్‌ తెలిపారు. డిజిటల్‌ ఎకానమీలో భారతీ దిగ్గజ ప్లేయర్‌గా కొనసాగుతుందని చెప్పారు. భవిష్యత్తులో జియోతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే టెలికాం పరిశ్రమపై పన్నులు అత్యధికంగా ఉన్నాయని, స్పెక్ట్రమ్‌ వ్యయాలు ఎక్కువగా ఉండి, టారిఫ్‌లు తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో పెట్టిన పెట్టుబడులన్నింటిన్నీ కలిపితే, దాని కంటే అధిక మొత్తంలో ఈ రెండేళ్లలో పెట్టుబడులుగా పెట్టినట్టు చెప్పారు. ప్రతి ఏడాది నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌కు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలు కలిసి రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు ఈ దిగ్గజాలు చెప్పాయి. టెలికాం పరిశ్రమ డిజిటల్‌ ఇండియా ప్రొగ్రామ్‌కు వెన్నుముకగా ఉందని మనోజ్‌ సిన్హా తెలిపారు.  2020 కల్లా 6 ట్రిలియన్‌ డాలర్ల మార్కును అధిగమిస్తుందని పేర్కొన్నారు. తొలిసారి భారత్ మొబైల్‌, ఇంటర్నెట్‌, టెక్నాలజీ ఈవెంట్‌ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. డిజిటల్‌ వృద్ధికి దోహదం చేస్తూ.. డిజిటల్‌ ఇండియాను విజయవంతం చేస్తున్న మొబైల్‌ కంపెనీలు సహకారాన్ని అభినందిస్తున్నట్టు రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement