టెల్కోలకు మరోషాక్‌:  డాట్‌ డెడ్‌లైన్‌

Telecom Department sets deadline for Bharti Airtel Vodafone Idea to clear dues - Sakshi

అర్థరాత్రి 11.59 నిమిషాలలోపు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించండి - డాట్‌

భారతీ ఎయిర్టెల్‌, వోడాఫోన్‌  ఐడియాకు మరిన్ని కష్టాలు

సాక్షి,  న్యూఢిల్లీ:  ఏజీఆర్‌ బకాయిల  చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా,  తాజాగా టెలికాం విభాగం (డాట్‌) మరోషాక్‌ ఇచ్చింది.  రాత్రి 11. 59 నిమిషాల్లోపు  బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్‌ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్‌ఐడియాకు ఈ సమయంలో  బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్‌ ఐడియా షేరు భారీగా నష్టపోయింది.

కాగా ఏజీఆర్‌ బకాయిల విషయంలో  కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ  టెలికం కంపెనీలపై  సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది.  రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని  సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది.  ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్‌) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా  మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు  చెల్లించాల్సివుంది.  రిలయన్స్‌ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే.

చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top