‘మనీ’ మాట..బంగారు బాట

Special Article About Investment On Children In Profit Plus - Sakshi

చిన్న నాటి నుంచే సరైన దిశగా అడుగులు

ద్రవ్య నిర్వహణ, ఖర్చులు, పొదుపు, ఇన్వెస్టింగ్‌ నేర్పాలి

తల్లిదండ్రుల్లో తగిన అవగాహన అవసరం

పిల్లలతో చర్చించడం మంచి అలవాటు

డబ్బుకు వారిని దూరం పెట్టడం మంచేమీ కాదు

చిన్నారులకు ఎన్నో విషయాలు నేర్పుతాం. కానీ, డబ్బు (మనీ) దగ్గరకొచ్చేసరికి వారిని దూరం పెడతాం. ఆదాయం, పొదుపు, పెట్టుబడులు.. ఇవేవీ వారికి అంత చిన్న వయసులో అవసరం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ, చిన్న వయసులోనే కదా వారికి ఈత నేర్పిస్తాం. మరి భవిష్యత్తులో ఆర్థిక సాగరాన్ని ఈదే అద్భుత పునాది చిన్నప్పుడే ఎందుకు వేయకూడదు? ఆలోచించండి. ఆందోళనకు గురికాకుండా, సంక్షోభ సమయాల్లో మనీ వ్యవహారాలను ఎలా పరిష్కరించాలన్న కిటుకులను పెద్దలు తమ అనుభవ పాఠాల నుంచి చిన్నారులకు నేర్పించడం ఎంతో మేలు చేస్తుంది.

ఆర్థిక విషయాల పట్ల సరైన అవగాహన కలిగిన తల్లిదండ్రులు వాటి గురించి తమ పిల్లలతో చర్చించడం మంచి చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకానీ, మనీ వ్యవహారాలకు వారిని దూరం పెట్టడం మంచి కంటే నష్టానికే అవకాశం ఉందంటున్నారు. పూర్తిగా అర్థం చేసుకునే వయసులో లేనప్పుడు పిల్లలకు ఆర్థిక విషయాల గందరగోళం ఎందుకు? అన్న ప్రశ్న సహేతుకమే. కానీ, అర్థం చేసుకోలేకపోవడం అన్ని విషయాల్లోనూ కాదు కదా?.. ఈ ప్రశ్న ప్రతి ఒక్క తల్లిదండ్రీ వేసుకోవాలి. కనుక పిల్లలు అర్థం చేసుకోతగిన విషయాల గురించి వారితో చర్చించడం, మనీ వ్యవహారాల గురించి ఇంట్లో చర్చించడం చిన్నారులకు మేలు చేస్తుందని, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అవగాహన వారిలో కల్పిస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తీకరిస్తున్నారు.

వయసు, అవగాహన 
ఒక విషయాన్ని అర్థం చేసుకునే శక్తి తమ పిల్లల్లో ఉందా? దాన్ని పరిష్కరించే నైపుణ్యం ఉందా? అన్నది తల్లిదండ్రులకు సాధారణంగా తెలుస్తుంది. ఏడేళ్లలోపు పిల్లలతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడడానికి చాలా మంది సుముఖత చూపరు. కానీ, వారితో మాట్లాడడమే మంచి ఆలోచన అవుతుంది.  కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు.ఇది వారిలో అనవసర ఆందోళనకు కారణమవ్వడంతోపాటు, ఫలితంగా ఈ విషయాలను ఎవరితోనూ వ్యక్తీకరించేందుకు ధైర్యం చేయకపోవచ్చు.

ఇదే ఒత్తిడి వారు పెద్దయిన తర్వాత కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు తండ్రి రుణ చెల్లింపుల్లో విఫలమై బ్యాంకు నుంచి వేధింపులకు లోనైతే, దాన్ని చూసిన పిల్లలు పెద్దయ్యాక రుణాలు తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోవచ్చు. అందుకే పిల్లలతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడడం, వారిలో సానుకూల దృక్పథాన్ని కలిగించడం మంచి ఫలితాన్నే ఇస్తుంది.

సానుకూల అభిప్రాయం 
ఆర్థిక సమస్య ఏదైనా కానీయండి.. దాని పట్ల సానుకూల దృక్పథం అన్నది పిల్లల్లో ఆందోళనను పారదోలుతుంది. ఏదైనా ఒక సమస్య లేదా సంక్షోభాన్ని పెద్దలు ఎదుర్కొంటున్నట్టు అయితే అది.. బడ్జెట్‌ గురించి, పరిమిత వ్యయాలు, ఆర్థిక క్రమశిక్షణ గురించి పిల్లలకు నేర్పేందుకు అనుకూల సమయం అవుతుంది. ఉదాహరణకు వ్యాపారంలో ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నట్టు అయితే, దానికి దారి తీసిన పరిస్థితుల గురించి వారికి వివరించడం మేలు చేసినట్టు అవుతుంది. ఒకవేళ ఆ సమస్యను పరిష్కరించే విషయంలో చిన్నారుల సలహాలను కోరడం వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది.

వ్యయాలను నియంత్రించుకోవడం ఎలా? అంటూ వారి నుంచి సూచనలను రాబట్టడంలో తప్పు లేదు. అయితే, వారి నుంచి ఎటువంటి సూచన, స్పందన రాకపోతే మాత్రం నిందించొద్దు. ఆలోచన తట్టినప్పుడు వచ్చి చెప్పాలని వారిని వెన్ను తట్టాలి.

దాచడం అన్ని వేళలా సరికాదు.. 
పిల్లలకు ఆర్థిక సమస్యల గురించి తెలియకుండా జాగ్రత్తపడడం కూడా మంచి ఆలోచన కాదంటారు నిపుణులు. ముఖ్యంగా 12 ఏళ్ల వయసు నాటికి పిల్లలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి, మనీ వ్యవహారాల గురించి తెలుసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా తమ ఉద్యోగాన్ని కోల్పోతే పిల్లల ముందు ఆందోళన చెందకూడదు. మరో ఉద్యోగం సంపాదించి, కుదురుకునే మార్గాన్ని వారికి తెలియజేయడం వల్ల.. భవిష్యత్తు పట్ల వారిలో నమ్మకాన్ని పెంచిన వారవుతారు.

గొడవ పడొద్దు.. 
ఆర్థికంగా ఎటువంటి సమస్యల్లో అయినా జీవిత భాగస్వామితో పిల్లల ముందు గొడవపడకూడదు. ఇది సమస్యను పరిష్కరించే విషయంలో ప్రతికూల ప్రభావం వారిపై పడేలా చేస్తుంది. అంతే కాదు, భవిష్యత్తులో వారి, వారి జీవిత భాగస్వామితో అనుబంధాలను ప్రభావితం చేస్తుంది. సమస్యను వివరించి, జీవిత భాగస్వామితో కలసి (తల్లిదండ్రి సంయుక్తంగా) దాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లలకు మంచి సందేశాన్ని పంపొచ్చు. అలాగే, ఆర్థిక సమస్యలకు పిల్లలను నిందించడం కూడా తప్పే.  ఆర్థిక అంశాల పట్ల పరస్పర అవగా హన పెంపొందించుకోవడం ప్రధానం.

పెట్టుబడి అలవాటు 
ఆర్థికపరమైన ఒక మంచి సలహా పిల్లల జీవితాలను గొప్పగా తీర్చిదిద్దడానికి సాయపడొచ్చు. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్‌ అన్నదానిని పిల్లలు యుక్తవయసు నాటికే అలవాటు చేయడం భవిష్యత్తులో వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుకు ఉదాహరణ ముంబైకి చెందిన శాలినీ రెడ్డి. ఆమె కూడా ఒక మిలీనియల్‌. కానీ, తోటివారిలా రెస్టారెంట్లలో ఖరీదైన విందులు, ఖరీదైన గ్యాడ్జెట్లపై ఖర్చు చేయడానికి అంత ప్రాధాన్యం ఇవ్వదు. బదులుగా బ్యాంకు ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ఆరంభించింది.

అలాగే, రికరింగ్‌ డిపాజిట్‌ను కూడా ప్రారంభించింది. తనకు పెద్దగా ఖర్చుల్లేవని, దాంతో వచ్చే పదేళ్లు మరింత అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తానన్నది ఆమె మాట. ఈమె మాత్రమే కాదు.. బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల కామర్స్‌ విద్యార్థి మానవ్‌ కూడా ఆర్థిక జ్ఞానం కలిగినవాడే. పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకాలను ఎన్నింటినో చిన్న వయసులోనే చదివేసిన అతడు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ ప్రారంభించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పాడు.

ముందు నేర్పితే ఎంతో లాభం.. 
ఆర్థిక అక్షరజ్ఞానాన్ని పిల్లలకు విద్యాలయాలు ఇవ్వడం లేదు. చివరికి వారి తల్లిదండ్రులు కూడా ఈ విషయాల గురించి నేర్పడం లేదు. దీంతో అధిక శాతం మంది పర్సనల్‌ ఫైనాన్స్‌ (వ్యక్తిగత ఆర్థిక విషయాలు, బడ్జెట్‌) గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే సంపాదన జీవితాన్ని ఆరంభిస్తున్నారు. ‘‘డ్రైవింగ్‌ నేర్చుకోకుండా మీ పిల్లలను బైక్‌ నడిపేందుకు అనుమతించరు కదా. మరి వారికి కనీస సూత్రాలు కూడా తెలియకుండా ఇన్వెస్టింగ్‌ ప్రపంచం వైపు అడుగులు ఎలా వేయించగలుగుతాం’’ అని ఆల్ఫా క్యాపిటల్‌కు చెందిన అసోసియేట్‌ పార్ట్‌నర్‌ దీప్తి గోయల్‌ ప్రశ్నించారు.

చాలా ఇళ్లలో మనీ వ్యవహారాలను పిల్లలతో చర్చించేందుకు ఇష్టపడని వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అరుదుగా చర్చించడాన్ని చూడొచ్చు. కానీ, చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు జీవితాంతం వారిని నడిపిస్తాయని తెలిసిందే. డబ్బులను నిర్వహించడం గురించి పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించినది వారి ఆర్థిక జీవితాలపై ఎంతో ప్రభావితం చూపిస్తుందని ప్లాన్‌ రూపీ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి పేర్కొన్నారు.

తప్పుదోవ
ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ మంది తల్లిదండ్రుల్లో ద్రవ్య నిర్వహణ విధానం గురించి తగినంత అవగాహన ఉండడం లేదు. ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల వారిచ్చే సూచన తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. హైదరాబాద్‌కు చెందిన అర్థయంత్ర నిర్వహించిన అధ్యయనం చెబుతున్నది ఏమిటంటే.. 21–25 వయసు మధ్యనున్న యువ నిపుణుల్లో ప్రతీ ముగ్గురిలోనూ ఇద్దరి నిర్ణయాలు వారి తల్లిదండ్రుల సూచనల మేరకే ఉంటున్నాయని తెలిసింది. సంప్రదాయ బీమా పథకాలను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి కొనసాగుతూనే ఉంది.

తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట ఎండోమెంట్‌ లేదా బైబ్యాక్‌ పాలసీ తీసుకుని బహుమతిగా ఇవ్వడం చేస్తున్నారు. దీంతో ఆరంభంలో కొన్ని సంవత్సరాల పాటు తల్లిదండ్రులు ప్రీమియం చెల్లించగా, మిగిలిన కాలానికి దాన్ని పిల్లలపై రుద్దుతున్నారు. పైగా తమ పిల్లలకు గొప్ప కానుక ఇస్తున్నామని వారు సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. అంతేకానీ, వారి భవిష్యత్తుకు సరిపోలని ఓ పెట్టుబడి సాధనాన్ని వారి చేతిలో పెడుతున్నామని అర్థం చేసుకోవడం లేదు. బీమా పాలసీలు, పీపీఎఫ్‌లో పెట్టుబడుల దిశగా పిల్లలను నడిపించడం, ఒత్తిడి చేయడం ఆశించిన ఫలితాలను ఇవ్వదని నిపుణులు సూచిస్తున్నారు.

సరైన బాట.. 
పిల్లలు హైస్కూల్‌ విద్యకు వచ్చిన నాటి నుంచే వారి పేరిట ఓ బ్యాంకు ఖాతా ప్రారంభించి, డెబిట్‌ కార్డు ఇవ్వడం ద్వారా ప్లాస్టిక్‌ మనీని వారికి పరిచయం చేయడం మంచిది. వారు సాధించే ప్రతీ విజయాన్ని ప్రోత్సహిస్తూ కొంత నగదు ప్రోత్సాహకం ఇవ్వాలి. ఆ నగదును వారు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసుకునేలా వెన్నుతట్టాలి. కార్డు నుంచి రోజువారీ ఖర్చుకు పరిమితులు విధించాలి. ముఖ్యంగా డబ్బు విలువ గురించి వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయడం వల్ల ఎన్నో సానుకూల ఫలితాలను చూస్తారు.

పిల్లలు ప్రారంభంలో తప్పటడుగులు వేసినా, వారిని వారు సరిదిద్దుకుంటారు. ‘‘కాలేజీ వయసులో బడ్జెట్‌ గురించి మూల విషయాలు తెలుసుకోవడం మంచిది. కొంచెం, కొంచెం కలిస్తేనే పెద్ద నిధిగా మారే క్రమం, కాంపౌండింగ్‌ ప్రయోజనం గురించి వారికి వివరంగా తెలియజేయాలి. అధికంగా ఖర్చు చేయడం సమస్యలకు ఎలా దారితీస్తుందన్నదీ వివరించాలి’’ అని మనీమంత్రా ఎండీ రాజ్‌ఖోస్లా సూచించారు. ఆర్థిక విషయాల పట్ల సరైన అవగాహన లేని తల్లిదండ్రులు, ఈ విషయంలో నిపుణుల సాయాన్ని తీసుకోవాలి. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా వారికి జాగ్రత్తలూ తెలియజేయాలి. టెక్నాలజీ ఎంతో అత్యాధునికతను సంతరించుకుంటున్న ఈ రోజుల్లో సైబర్‌ నేరాలపై కనీస అవగాహనను పిల్లల్లో కల్పించాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top