9,000 దిగువకు నిఫ్టీ

Sensex tanks 470 points to close at 30690 And Nifty below 9000 - Sakshi

పెరుగుతున్న కరోనా కేసులు

ఇంకొన్నాళ్లు లాక్‌డౌన్‌ పొడిగింపు

బలహీనంగా ఆసియా మార్కెట్లు

లాభాల స్వీకరణకు మొగ్గు

470 పాయింట్లు పతనమై 30,690 వద్ద ముగింపు

118 పాయింట్లు పతనమై 8,994 వద్ద ముగిసిన నిఫ్టీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం, కరోనా వైరస్‌ కట్టడికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌ మరికొంత కాలం కొనసాగే సూచనలు ఉండటంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31.000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. గత వారం నిఫ్టీ 13 శాతం లాభపడిన నేపథ్యంలో లాభాల స్వీకరణ సైతం చోటు చేసుకుంది.  ఆసియా మార్కెట్ల పతనం, ముడి చమురు ఉత్పత్తికి సంబంధించి సౌదీ అరేబియా, రష్యాల మధ్య ఒప్పందం కుదరడంతో చమురు ధరలు పెరిగి పడిపోవటం ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 470 పాయింట్లు నష్టపోయి 30,690 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 118 పాయింట్ల పతనంతో 8,994 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, లోహ సూచీలు  మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  

722 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌.....
సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది.  మధ్యాహ్నం నష్టాలు ఒకింత తగ్గినా, ఆ తర్వాత పెరిగాయి.  ఆరంభంలో 36 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 686 పాయింట్లు నష్టపోయింది.  మొత్తం మీద రోజంతా 722 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. నిజానికి 21  రోజుల లాక్‌డౌన్‌ నేటితో ముగియనుంది. నేడు (మంగళవారం) ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగిస్తారని అంచనా. ప్రస్తుతమున్నట్లుగానే లాక్‌డౌన్‌ కొనసాగేలా నిర్ణయం తీసుకుంటే, మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతుండటంతో ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఈస్టర్‌ మండే సందర్భంగా యూరప్‌ మార్కెట్లకు సెలవు.  

► భారీ ఆర్డర్లు లభించడం, రూ.9,000 కోట్ల మేర దీర్ఘకాలిక నిధులను సమీకరించనుండటం వంటి అంశాల కారణంగా  ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 6.5 శాతం లాభంతో రూ.866 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► బజాజ్‌ ఫైనాన్స్‌ 10 శాతం నష్టంతో రూ.2,288 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌  సర్వీసెస్, ఐనాక్స్‌ లీజర్, ప్రతాప్‌ స్నాక్స్, ఒబెరాయ్‌ రియల్టీ, ముత్తూట్‌ క్యాపిటల్, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2–3 శాతం రేంజ్‌లో నష్టపోయినా, ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 6 శాతం మేర పెరగడంతో నష్టాలు ఒకింత తగ్గాయి.

రూ.500 కోట్ల ఎన్‌సీడీఈఎక్స్‌ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: వ్యవసాయోత్పత్తుల స్టాక్‌ ఎక్సే్ఛంజీ ఎన్‌సీడీఈఎక్స్‌  ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 15కు చేరింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఎన్‌సీడీఈఎక్స్ఛ్‌ జారీ చేయనుంది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో 1.44 కోట్ల షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.500 కోట్ల మేర ఉంటుందని అంచనా.

నేడు సెలవు
అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top