సెన్సెక్స్‌ టార్గెట్‌ 36,985

Sensex ends Target at record high of 36985 - Sakshi

మార్కెట్‌ పంచాంగం

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా, ప్రతీ చిన్న క్షీణతలోనూ సైతం పెట్టుబడులు వెల్లువెత్తుతున్నందున, భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ గతవారం పటిష్టంగానే ట్రేడయ్యాయి.  విదేశీ సంస్ఘాగత ఇన్వెస్టర్లు మే నెలలో రూ.15,000 కోట్లు, జూన్‌నెలలో రూ.21,000 కోట్లకుపైగా స్టాక్‌ మార్కెట్లో కుమ్మరించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు జరిపిన నికర విక్రయాల మొత్తంలో, సగానికిపైగా గత రెండు నెలల్లో తిరిగి పెట్టుబడి చేయడం విశేషం. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 1.20 లక్షల కోట్ల వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఈ లాక్‌డౌన్‌ సమయంలో సంపాదించింది. అనిశ్చితి పరిస్థితుల్లో ఈ తరహాలో నిధులు తరలి వస్తుంటే, ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప, మార్కెట్లో పెద్ద కరెక్షన్‌ను ఇప్పట్లో అంచనావేయలేము. ఇక స్టాక్‌ సూచీల సాంకేతిక అంశాలకొస్తే....  

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
జూలై 3తో ముగిసినవారంలో 36,110 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 850 పాయింట్ల లాభంతో 36,021 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి రికార్డు గరిష్టస్థాయి 42,274 పాయింట్ల నుంచి మార్చి లాక్‌డౌన్‌ ప్రారంభ సమయంలో చవిచూసిన 25,639 పాయింట్ల స్థాయివరకూ జరిగిన పతనంలో 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 35,920 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్‌ గతవారం అధిగమించింది. ఈ కీలకస్థాయిని ఛేదించినందున, వచ్చే కొద్దిరోజుల్లో ఇక 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖను టార్గెట్‌ చేసుకుని, సెన్సెక్స్‌ ప్రయాణించే చాన్సుంది. ఈ రేఖ ప్రస్తుతం   36,985 పాయింట్ల సమీపంలో కదులుతోంది. ఈ వారం మార్కెట్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగితే 36,120 పాయింట్ల సమీపంలో చిన్నపాటి అవరోధం కలగవచ్చు. ఆపైన 36,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం దాటితే 200 డీఎంఏ రేఖ చలిస్తున్న 36,985 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం బలహీనంగా మార్కెట్‌ మొదలైతే 35,595 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 35,230 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 35,030 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.   

నిఫ్టీ తొలి నిరోధం 10,635 పాయింట్లు
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 10,550 పాయింట్ల స్థాయిని అవలీలగా అధిగమించి, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 224 పాయింట్ల లాభంతో 10,607 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పాజిటివ్‌గా మొదలైతే 10,635 పాయింట్ల  సమీపంలో తొలి నిరోధాన్ని చవిచూడవచ్చు.  ఈ స్థాయిని దాటితే 10,750 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 200 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం బలహీనంగా మొదలైతే 10,485 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,400 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  ఈ లోపున 10,335 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.

– పి. సత్యప్రసాద్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top