కార్వీపై ‘ఆంక్ష’లను సమీక్షించండి 

Sat hints to SEBI That To Decide on PVA by December 2 - Sakshi

పీవోఏపై డిసెంబర్‌ 2లోగా నిర్ణయం తీసుకోండి

సెబీకి శాట్‌ సూచనలు  

న్యూఢిల్లీ: క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోనివ్వకుండా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) సూచించింది. డిసెంబర్‌ 2లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. క్లయింట్ల షేర్లను సొంత అవసరాలకు ఉపయోగించుకుందన్న ఆరోపణలతో కార్వీపై సెబీ ఆంక్షలు విధించడం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, ప్రస్తుత క్లయింట్ల పీవోఏలను ఉపయోగించరాదని సెబీ హోల్‌టైమ్‌ సభ్యుడు(డబ్ల్యూటీఎం) అనంత బారువా నవంబర్‌ 22న ఇచ్చిన ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ కార్వీ గురువారం శాట్‌ను ఆశ్రయించింది.

పీవోఏలను ఉపయోగించుకోలేకపోవడం వల్ల లావాదేవీల సెటిల్మెంట్‌ విషయంలో సమస్యలు వస్తున్నాయని, క్లయింట్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. పీవోఏలను ఉపయోగానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టతనివ్వాలని కోరింది. తరుణ్‌ అగర్వాలా, ఎం.టి. జోషిలతో కూడిన శాట్‌ ద్విసభ్య బెంచ్‌ దీనిపై శుక్రవారం ఉత్తర్వులిస్తూ... కార్వీ కోరుతున్నట్లుగా సెబీ ఈ అంశాన్ని పరిశీలించాలని, సంస్థ తన వాదనలు వినిపించేందుకు అవకాశమిచ్చి.. తరవాత తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సెబీ మాజీ లీగల్‌ ఆఫీసర్‌ కేఆర్‌సీవీ శేషాచలం పార్ట్‌నర్‌గా ఉన్న విశేష లా సర్వీసెస్‌ సంస్థ కార్వీ తరఫున వాదిస్తోంది. మరోవైపు, ప్రస్తుత తరుణంలో కార్వీకి వెసులుబాటు కల్పిస్తే.. మరింతగా పీవోఏల దుర్వినియోగానికి దారి తీయొచ్చని సెబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top