ఓలా దేశం దాటేసింది

Ride hailing aggregator Ola goes international - Sakshi

ముంబై : దేశీయ ప్రముఖ రైడ్‌-హైలింగ్‌ కంపెనీ ఓలా దేశం దాటేసింది. నేటి(మంగళవారం) నుంచి అంతర్జాతీయంగా ఓలా సర్వీసులను అందించనున్నట్టు పేర్కొంది. ఆస్ట్రేలియా దేశంలో ప్రవేశంతో ఓలా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా క్యాబ్‌ సర్వీసులు అందజేస్తున్న ఉబర్‌ టెక్నాలజీస్‌కు, దేశీయంగా మాత్రమే కాక, అంతర్జాతీయంగా ఓలా గట్టి ఇవ్వబోతుంది. మెల్‌బోర్న్‌, సిడ్నీ, పెర్త్‌ నగరాల్లో తమతో కలిసి పనిచేయాలంటూ ప్రైవేట్‌ వెహికిల్‌ ఓనర్లను, డ్రైవర్‌ పార్టనర్లను ఓలా ఆహ్వానిస్తోంది. 2018 ప్రారంభం నుంచి దేశంలో కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించబోతున్నట్టు కూడా ఈ స్టార్టప్‌ తెలిపింది. ఇప్పటికే ఉబర్‌ ఆస్ట్రేలియాలో తన సేవలను అందిస్తోంది. దీంతో ఓలాకు అక్కడ సేవలు ప్రారంభించడం అంతపెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది.

రైడ్‌ హైలింగ్‌ సర్వీసుల రెగ్యులేషన్స్‌, ఎలా సిస్టమ్‌ పనిచేస్తుందో ఇప్పటికే అక్కడి డ్రైవర్లకు తెలిసి ఉంటుందని రీసెర్చ్‌ సంస్థ ఫారెస్టర్‌ సీనియర్‌ అనాలిస్ట్‌ సతీష్‌ మీనా తెలిపారు. తొలుత కస్టమర్లను, డ్రైవర్లను ఆకట్టుకోవడానికి కాస్త ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుందని మాత్రమే మీనా చెప్పారు. 2011లో ప్రారంభించిన ఓలా సర్వీసులు, ప్రముఖ రైడ్‌ సర్వీసుల సంస్థ ఉబర్‌కు గట్టి పోటీగా ఉన్నాయి. దేశీయంగా ఓలానే మెజార్టీ షేరును సంపాదించుకుంది. మొత్తం 110కి పైగా నగరాల్లో తన సేవలను అందిస్తోంది. ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌లకు కూడా కంపెనీ తన సేవలను విస్తరించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిశీలించడానికి, కనెక్టెడ్‌ కారు ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో కూడా చేతులు కలిపింది. ఓలా, ఉబర్‌ రెండింటిలోనూ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు గ్రూప్‌ కార్పొరేషన్‌ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top