రిలయన్స్‌ జియోలో భారీగా ఉద్యోగ నియామకాలు

Reliance Jio Hiring AI Team Under Akash Ambani, Report Says - Sakshi

న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ముఖేష్‌ అంబానీకి చెందిన టెలికాం వెంచర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ భారీగా ఉద్యోగాల నియామకాలకు తెరతీసింది. ఈ ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని రిలయన్స్‌ జియో ప్లాన్‌ చేస్తోంది. కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను జియో చేపడుతోంది. ఈ నియామకాలతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో నిపుణులైన ప్రొఫిషనల్స్‌ను జియో నియమించుకోవడం ప్రారంభించింది. 

జియో నియమించుకునే ఈ ఏఐ టీమ్‌ ఆకాశ్‌ అంబానీ నేతృత్వంలో పనిచేయనున్నారని మింట్‌ రిపోర్టు చేసింది. ఈ ఏఐ టీమ్‌ను నిర్మించడానికి జియో కొంతమంది సీనియర్‌ అధికారులను నియమించిందని, బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ఈ టీమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని తెలిపింది. ఆకాశ్‌ అంబానీ ఈ టీమ్‌పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తన భుజాలపై వేసుకున్నారని జియో అధికారులు చెప్పినట్టు రిపోర్టు కోడ్‌ చేసింది. ఏఐతో పాటు బెంగళూరులో మిగత నియామకాల ప్రక్రియను కూడా జియో ప్రారంభించింది. మిషన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే వారిని కంపెనీ తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75 వేల నుంచి 80 వేల మందిని నియమించుకోనున్నామని జియో చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్సస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ జాగ్‌ కూడా చెప్పారు. 

కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, దీనిలో టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్లు కూడా ఉన్నట్టు జాగ్‌ చెప్పారు. ‘రిలయన్స్‌ రెడీ’అనే దాని కోసం కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్‌ చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ సహకారంతో కూడా నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రిఫెరల్స్‌ ద్వారా 60 శాతం నుంచి 70 శాతం నియమిస్తున్నామని, తమ రిక్రూట్‌మెంట్‌ ప్లాన్‌లో కాలేజీలు, ఎంప్లాయీ రిఫెరల్స్‌ ప్రధాన భాగాలని జాగ్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top