7 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్‌..

Reliance Industries Reclaims USD 100 Billion M-Cap Mark - Sakshi

న్యూఢిల్లీ : ఎనర్జీ నుంచి టెలికమ్యూనికేషన్స్‌ వరకు పలు వ్యాపారాల్లో అగ్రగామిగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అద్భుత ఘనతను సాధించింది. గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌దూసుపోయింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 100 బిలియన్‌ డాలర్ల(రూ.6,85,550 కోట్లకు పైగా) మార్కును దాటేసింది. అంటే 7 లక్షల కోట్లకు చేరువలోకి వచ్చింది. కంపెనీ షేర్లు రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ఈ మేర పెరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈ మేర దూసుకుపోవడం వరుసగా ఇది ఐదోరోజు. జూన్‌ క్వార్టర్‌ ఫలితాలకు ముందు కంపెనీ ఏజీఎంలో దూకుడు వ్యాపార ప్రణాళికను ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్‌ షేర్లు ఈ మేర లాభాలను ఆర్జిస్తున్నాయి.  

గురువారం ఈ కంపెనీ షేర్లు రూ.1,043.15 వద్ద ప్రారంభమయ్యాయి. అనంతరం రూ.1,091 వద్ద వెంటనే 52 వారాల గరిష్టాలను తాకాయి. నిన్నటి ముగింపుకు ఇది 5.27 శాతం అధికం. ఎన్‌ఎస్‌ఈలోనూ రిలయన్స్‌ స్టాక్‌ ఈ విధంగానే ట్రేడవుతుంది. 5.02 శాతం జంప్‌ చేసి, రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. కంపెనీ ఈ విధమైన మైలురాయిని 2007 అక్టోబర్‌లో సాధించింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు సైతం ఈ విధంగానే దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్ల మేర ర్యాలీ జరిపి, 36,697 వద్ద రికార్డులను సృష్టిస్తోంది. నిఫ్టీ సైతం 11 వేల మార్కును అధిగమించేసి ట్రేడవుతోంది. కాగ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత వారంలోనే తన వార్షిక సాధారణ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టెలికాం దిగ్గజాలకు మరింత షాకిస్తూ తన దూకుడు వ్యాపార ప్రణాళికను వెల్లడించింది. ఇక అప్పటి నుంచి స్టాక్‌ పైపైకి దూసుకుపోతూనే ఉంది. జూలై 5 నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేర్లు 13.05 శాతం లాభపడ్డాయి. ఏజీఎంలో ముఖేష్‌ అంబానీ కస్టమర్లు ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఆల్ట్రా హై-స్పీడ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను లాంచ్‌ చేశారు. ఆగస్టు 15 నుంచి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top