భద్రత విషయంలో రాజీపడకుండా తక్కువ విలువగల ఆన్‌లైన్ ఈ-కామర్స్ లావాదేవీల విషయంలో సింగిల్ అథంటికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ యోచిస్తోంది.
న్యూఢిల్లీ: భద్రత విషయంలో రాజీపడకుండా తక్కువ విలువగల ఆన్‌లైన్ ఈ-కామర్స్ లావాదేవీల విషయంలో సింగిల్ అథంటికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. సింగిల్ అథంటికేషన్ కోసం నిబంధనలను రూపొందిస్తున్నామని, కొన్ని వారాల్లోనే వాటిని వెల్లడిస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ చెప్పారు. ఈ అంశంపై బ్యాంకులు, నియంత్రణ సంస్థల నుంచి అభిప్రాయాల్ని తీసుకుంటామని తెలిపారు. ఎంత మొత్తం వరకు ఈ సింగల్ అథంటికేషన్ పద్ధతిని అనుమతిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల మాదిరి కాకుండా భారత్‌లో రెండు అంచెల అథంటికేషన్ పద్ధతి ఉంది. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలన్నా, బస్సు టిక్కెట్‌ను రిజర్వేషన్ చేయాలన్నా మొదటగా మన క్రెడిట్/ డెబిట్ కార్డు వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన మొబైల్‌కు వచ్చే వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ను ఎంటర్ చేస్తేనే ఆన్‌లైన్ లావాదేవీ పూర్తి అవుతుంది.


