breaking news
Single Authentication method
-
టీవీ చానళ్లలో అర గంట, రేడియోలో గంట
న్యూఢిల్లీ: టీవీ, రేడియో ప్రసార సేవల కోసం ఒకే నియంత్రణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా జాతీయ, సామాజిక ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన బాధ్యత టీవీ చానళ్ల నుంచి రేడియో సేవలకు కూడా విస్తరించింది. ఈ మేరకు ‘టెలికమ్యూనికేషన్స్(టీవీ, రేడియో, సంబంధిత సేవలు) రూల్స్–2026’ముసాయిదాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. టీవీ చానళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య జాతీయ, సామాజిక సంబంధిత అంశాలపై కనీసం 30 నిమిషాల పాటు కార్యక్రమాలను ప్రసారం చేయాల్సి ఉండగా, రేడియో స్టేషన్లు ప్రతిరోజూ ఒక గంట సమయాన్ని దీనికి కేటాయించాల్సి ఉంటుందని ముసాయిదాలో స్పష్టంచేసింది. నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన ‘భారతదేశంలో టెలివిజన్ చానళ్ల అప్లింకింగ్, డౌన్‌లింకింగ్ మార్గదర్శకాలు–2022’ప్రకారం.. టీవీలో ఇటువంటి కంటెంట్‌ను ప్రసారం చేయడం తప్పనిసరి చేసినప్పటికీ, సమయాన్ని కచ్చితంగా పేర్కొనలేదు. దానిపై స్పష్టత ఇస్తూ ముసాయిదా రూపొందించారు. అలాగే, ఎఫ్ఎం పాలసీ మూడో దశ ప్రకారం.. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా ప్రతిరోజూ ఒక గంట పాటు ప్రజాప్రయోజన ప్రకటనలను ప్రసారం చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ రేడియో స్టేషన్లపై ఉంది. ప్రజా ప్రయోజన ప్రకటనల గురించి కేంద్రం స్పష్టమైననిర్వచనాన్ని ఈ ముసాయిదాలో ఇచ్చింది. ప్రతి అధీకృత ప్రైవేట్ రేడియో సర్వీసు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే విధంగా, జాతీయ ప్రాముఖ్యత, సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలను రోజుకు కనీసం ఒక గంట పాటు ప్రసారం చేయాలి అని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. టీవీ చానళ్లు ప్రజా సేవా కార్యక్రమాలను ప్రసారం చేయొచ్చు. ఇకపై దీనిని తప్పనిసరి చేస్తూ ముసాయిదాలో నిబంధన చేర్చారు. విద్య, అక్షరాస్యత వ్యాప్తి; వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం; మహిళా సంక్షేమం; సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం; పర్యావరణ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ; జాతీయ సమైక్యతలను ముసాయిదాలో కూడా కొనసాగించారు. నిబంధనలను పాటించడం సాధ్యం కాని కొన్ని వర్గాలకు మినహాయింపు ఉంటుందని ఆ ముసాయిదా పేర్కొంది. దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలని, అభ్యంతరాల ఉంటే తెలియజేయాలని ప్రజలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోరింది. -
ఆన్లైన్ లావాదేవీలకు సింగిల్ అథంటికేషన్ !
న్యూఢిల్లీ: భద్రత విషయంలో రాజీపడకుండా తక్కువ విలువగల ఆన్లైన్ ఈ-కామర్స్ లావాదేవీల విషయంలో సింగిల్ అథంటికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది. సింగిల్ అథంటికేషన్ కోసం నిబంధనలను రూపొందిస్తున్నామని, కొన్ని వారాల్లోనే వాటిని వెల్లడిస్తామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ చెప్పారు. ఈ అంశంపై బ్యాంకులు, నియంత్రణ సంస్థల నుంచి అభిప్రాయాల్ని తీసుకుంటామని తెలిపారు. ఎంత మొత్తం వరకు ఈ సింగల్ అథంటికేషన్ పద్ధతిని అనుమతిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరి కాకుండా భారత్‌లో రెండు అంచెల అథంటికేషన్ పద్ధతి ఉంది. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలన్నా, బస్సు టిక్కెట్‌ను రిజర్వేషన్ చేయాలన్నా మొదటగా మన క్రెడిట్/ డెబిట్ కార్డు వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన మొబైల్‌కు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ను ఎంటర్ చేస్తేనే ఆన్లైన్ లావాదేవీ పూర్తి అవుతుంది.


