రతన్ టాటా పక్కన ఈ వ్యాపారవేత్త ఎవరంటే..

 Ratan Tata invests in pharmaceutical startup Generic Aadhaar - Sakshi

రతన్ టాటా  ఆసక్తికర పెట్టుబడులు

యంగ్ స్టార్టప్  జెనెరిక్ ఆధార్‌ లో 50 శాతం వాటా  కొనుగోలు

సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త రతన్ టాటా తాజా పెట్టుబడులు ఆసక్తికరంగా నిలిచాయి.  ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయన వెల్లడించలేదు.  ముంబైలోని  యువ వ్యవస్థాపకుడు, సీఈవో  అర్జున్ దేశ్‌పాండే (18)కు  చెందిన ‘జనరిక్‌ ఆధార్‌'లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. 

సరసమైన ధరలకే ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్‌ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల  ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది.  ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా ఈ సంస్థలో సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు.  ప్రస్తుతం, ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రోలలోకి విస్తరించలనే ప్రణాళికలో వుంది. అలాగే  రాబోయే నెలల్లో 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.  న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను అందిస్తుంది.  అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు త్వరలోనే ప్రజలకు అందించాలని ప్లాన్ చేస్తోంది.  (రిలయన్స్ దన్ను, భారీ లాభాలు)

కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్‌ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా వుందని దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన తరువాత జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు సరసమైన ధరలకు మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నానన్నారు.  కాగా  అర్జున్‌ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే  షార్ట్ లిస్ట్ కావడం విశేషం. 

చదవండి : మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top