ఫలితాలు, గణాంకాలే కీలకం

ఫలితాలు, గణాంకాలే కీలకం - Sakshi


* మార్కెట్‌పై ప్రభావం చూపనున్న అంశాలు ఇవీ..

* ఈ వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలు

* ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా

* ప్రపంచ మార్కెట్ల పోకడ


ముంబై: బ్లూ చిప్ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు... ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ ఐటీ కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక  ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే రానున్నాయి.



నవంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, డిసెంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల  ద్రవ్యోల్బణ  గణాంకాలు కూడా ఈ వారంలోనే రానున్నాయి. ఈ అంశాలతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి కదలికలు ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు.

 

టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు హిందూస్తాన్ యూనిలివర్, జీ ఎంటర్‌టైన్మెంట్, ఇండస్‌ఇంద్ బ్యాంక్ తదితర దిగ్గజ కంపెనీలు ఈ వారంలోనే తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. జనవరి 12న టీసీఎస్, 14న ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడతాయి. ఈ వారంలో పలు కీలకాంశాలు చోటు చేసుకోనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, వీటితో పాటు పలు ప్రధాన కంపెనీలు తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయని పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం చలించే తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కదలికలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు.

 

‘అంతర్జాతీయ’ ప్రభావమే అధికం !

భారత కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం కంటే అంతర్జాతీయ సంకేతాల ప్రభావమే ఈ వారంలో స్టాక్‌మార్కెట్‌పై అధికంగా ఉంటుందని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థ అభిప్రాయ పడింది. అంతర్జాతీయ సంకేతాల్లో ఎలాంటి మెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొంది. అందువల్ల ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నాణ్యత గల షేర్లపైననే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాజా ఆందోళనలు, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం వంటి కారణాల వల్ల గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,227 పాయింట్లు(4.68 శాతం) నష్టపోయింది.

 

డెట్ మార్కెట్లో ‘విదేశీ’ జోరు

భారత డెట్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,700 కోట్లకు పైగా డెట్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది మొత్తం మీద భారత డెట్‌మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.45,856 కోట్లుగా ఉన్నాయి. డిపాజిటరీ సంస్థలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 8వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా డెట్ మార్కెట్లో రూ.3,706 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి ఒకింత స్థిరంగా ఉండడం వల్ల డెట్ మార్కెట్లో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.  



ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లలోపే ఉండడం, కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉండడం, రూపాయి అవుట్‌లుక్ సానుకూలంగా ఉండడం వంటి అంశాలూ ప్రభావం చూపాయని వారంటున్నారు. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆందోళన  కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి  రూ.493 కోట్ల పెట్టుబడులు   ఉపసంహరించుకున్నారు.  మొత్తం క్యాపిటల్ మార్కెట్లో జనవరి 1-8 కాలానికి వీరి నికర పెట్టుబడులు రూ.3,214 కోట్లుగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top