బ్యాంకుల దుస్థితికి రాజకీయ నేతలే కారణం | political leaders of the banks are the reason | Sakshi
Sakshi News home page

బ్యాంకుల దుస్థితికి రాజకీయ నేతలే కారణం

Apr 19 2018 6:25 AM | Updated on Apr 19 2018 6:25 AM

political leaders of the banks are the reason - Sakshi

పుణే: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు ఢిల్లీ రాజకీయ నేతలే కారణమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్‌ ఎం దామోదరన్‌ వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు పీఎస్‌బీలను ప్రైవేటీకరించడమనేది సరైన పరిష్కార మార్గం కానే కాదన్నారు. ఆర్‌బీఐ నిర్వహణలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులకు ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘అనేక సంవత్సరాలుగా ఢిల్లీ (రాజకీయ నేతల) నుంచి ముంబైకి (పలు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలున్న ఆర్థిక రాజధాని) వస్తున్న ఫోన్‌ కాల్సే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి మూలం. ముంబైలోని వారు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు తు.చ. తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు‘ అని దామోదరన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను సమర్థిస్తూ.. మొండిబాకీల సమస్యను సరిదిద్దాలంటే ఆయా బ్యాంకుల ప్రైవేటీకరణ తగిన పరిష్కారమార్గం కాదని చెప్పారు.  

నిజాయితీకి ’ప్రైవేట్‌’ పర్యాయపదమేమీ కాదు.. 
ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్య సంబంధమైన, విభిన్నమైన పాలనా సంబంధమైన అంశాలే వాటి సమస్యలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతిదీ ప్రైవేటీకరించాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే.. ప్రైవేటీకరణ అనేది నిజాయితీకి, సమర్థతకు పర్యాయపదమేమీ కాదనడానికి నిదర్శనంగా ఇటీవల పలు ఉదంతాలు కనిపిస్తున్నాయి‘ అని దామోదరన్‌ చెప్పారు. ప్రశ్నార్థకమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విధానాలతో ప్రైవేట్‌ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంకులు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. భారతదేశం వంటి విభిన్న దేశంలో పటిష్టమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ‘యాజమాన్య అధికారం ఉంది కదా అని మేనేజ్‌మెంట్‌ కూడా చేయొచ్చని ప్రతీ లావాదేవీ తమ ఆదేశాల ప్రకారమే జరగాలనుకున్న పక్షంలో అలాంటి యాజమాన్యం వల్ల సమస్యలు తప్పవు. ప్రైవేటీకరణ చాలా గొప్పదని అనుకోవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల సమస్యలను విశ్లేషించి, పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సమస్యలు లేని అద్భుతమైన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అనేకం ఉన్నాయి‘ అని దామోదరన్‌ పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement