తొలిసారి పడిపోయిన వివో, ఒప్పో
మొట్టమొదటిసారి వివో, ఒప్పో కంపెనీలు తమ అమ్మకాల్లో పడిపోయాయి.
మొట్టమొదటిసారి వివో, ఒప్పో కంపెనీలు తమ అమ్మకాల్లో పడిపోయాయి. జూలై నెలలో వీటి అమ్మకాలు 30 శాతం ఢమాలమన్నాయి. మొత్తంగా దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు 8 శాతం వృద్ధి చెందిన క్రమంలో వీటి అమ్మకాలు పడిపోవడం గమనార్హం. ఈ ఏడాదిలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 22 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంతకముందు ఎక్స్‌క్లూజివ్‌గా ఆన్‌లైన్ విక్రయాలు మాత్రమే జరిపే షావోమి లాంటి ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, ఆఫ్‌లైన్ మార్కెట్‌లోకి ప్రవేశించడంతో వివో, ఒప్పోలకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు షావోమి తన రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 5 మిలియన్ యూనిట్లకు పైగా నమోదుచేసింది. తన పోటీదారులకు షావోమి మరింత గట్టి పోటీని ఇస్తోంది.
ఈ నెలలో వివో, ఒప్పోలు 30 శాతం పడిపోయాయని, జూలై నెలలో వీటి విక్రయాలు మరింత కిందకి దిగజారే అవకాశముందని నాలుగు లీడింగ్ సెల్‌ఫోన్ రిటైల్ చైన్స్ తెలిపారు. వివో, ఒప్పో కంపెనీలు తమ స్వదేశ(చైనీస్) అధికారులను భారత్‌కు పంపిస్తున్నాయి. భారత ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి వారు డిస్ట్రిబ్యూటర్లతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు. అయితే ఈ విషయంపై వివో కానీ, ఒప్పో కానీ స్పందించడం లేదు. శాంసంగ్ తర్వాత రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండుగా షావోమి నిలుస్తోంది.