
నష్టాలతో మొదలైన మార్కెట్ గురువారం మిడ్‌సెషన్ కల్లా మళ్లీ లాభాల్లోకి మళ్లింది. మెటల్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్ యూటర్న్‌కు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిప్టీ ఇండెక్స్ కనిష్టం నుంచి 200 పాయింట్లు లాభపడి 10వేలపైకి చేరుకుంది. సెన్సెక్స్ ఇంట్రాడే లో నుంచి 700 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 2గంటలకు సెన్సెక్స్ నిన్నటి ముగింపుతో పోలిస్తే 522 పాయింట్లు పెరిగి 34,030.58 వద్ద, నిఫ్టీ 164 పాయింట్లు పెరిగి 10,045 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3శాతం లాభంతో 20,806.85 వద్ద ట్రేడ్ అవుతోంది.
జీ లిమిటెడ్, బజాజ్‌ఫైనాన్స్, వేదాంత, కోల్ ఇండియా, బజాజ్‌ఫిన్ సర్వీసెస్ షేర్లు 4.50శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి. మారుతి సుజుకీ, హిందూస్థాన్ యూనిలివర్, బజాజ్ అటో, నెస్లే, ఓఎన్‌జీసీ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.