ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌లు | Sakshi
Sakshi News home page

ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌లు

Published Tue, Apr 29 2014 1:14 AM

ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌లు - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ సూచీలు గరిష్ట స్థాయిల్లో కదులుతున్నప్పటికీ లార్జ్‌క్యాప్ షేర్లతో పోలిస్తే అనేక మిడ్ క్యాప్ షేర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. ఎన్నికల అనంతరం కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తే ఇన్‌ఫ్రా రంగం బాగా పుంజుకునే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వినయ్ శర్మ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన డివిడెండ్ ఈల్డ్ పథకం వివరాలను తెలియచేయడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకి గడ్డుకాలం తొలగినట్లే అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం సంస్కరణలను కొనసాగిస్తూ, జీఎస్‌టీ, ఆదాయపు పన్నుల్లో మార్పులు తీసుకొస్తే ఈ ఏడాది కూడా మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తాయన్నారు.

ఇంకా ఏమన్నారంటే.... దిగిరాకపోతే కష్టమే..
 వడ్డీరేట్లు దిగిరాకపోతే అది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లు దిగివచ్చే అవకాశాలు కనిపించడం లేదని దీనికితోడు ఎలినెనో మార్కెట్లను మరింత భయపెడుతోందన్నారు. ఎలినెనో వల్ల వర్షాభావం ఏర్పడితే దేశీయ వినియోగంపై దెబ్బతింటుందని శర్మ తెలిపారు. కాని ఇప్పుడే ఎలినెనో ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పలేమని, ద్రవ్యోల్బణం తగ్గి 5-6 నెలలు స్థిరంగా ఉంటే కాని వడ్డీరేట్లు తగ్గే అవకాశం లేదన్నారు.

 అమ్ముతూనే ఉన్నారు..
 మార్కెట్లు గరిష్ట స్ధాయిలో ఉన్నప్పటికీ దేశీయంగా చిన్న ఇన్వెస్టర్లు ఇప్పటికీ మార్కెట్లకు దూరంగానే ఉంటున్నట్లు శర్మ పేర్కొన్నారు. సూచీలు బాగా పెరిగిన తర్వాత గతంకంటే పరిస్థితి కొద్దిగా మెరుగైనప్పటికీ దేశీయ ఫండ్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

 ఇప్పట్లో కొత్త పథకాలు లేవు
 ఇప్పటికే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పోర్ట్‌ఫోలియోలో అనేక రకాల పథకాలు ఉండటంతో కొత్త తరహా ఈక్విటీ ఫండ్స్ ప్రవేశపెట్టే ఆలోచన లేదని శర్మ స్పష్టం చేశారు. ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన డివిడెండ్ ఈల్డ్ విభాగంలో ఇక్కడ తక్కువ పథకాలు అందుబాటులో ఉండటంతో దీనిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ కింద కేవలం రూ.6,000 కోట్ల ఆస్తులు మాత్రమే నిర్వహణలో ఉన్నాయని, ఈ విభాగం మరింత వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయన్నారు.

 డివిడెండ్ ఈల్డ్ ఫండ్
 అత్యధికంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీలను ఎంపిక చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.  నిఫ్టీ డివిడెండ్ ఆపర్చునిటీస్ ఇండెక్స్ ప్రామాణికంగా పనిచేసే ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 80 శాతం నిఫ్టీ ఇండెక్స్ షేర్లకే కేటాయించనున్నట్లు శర్మ తెలిపారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 9న ముగుస్తుంది, ఈ సమయంలో రూ.700 - 800 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement