జీడీపీ పతనంపై మాజీ ప్రధాని తీవ్ర అందోళన

Manmohan Singh Worry About GDP Growth Rate - Sakshi

ఆందోళనకరస్థాయిలో దేశ వృద్ధి రేటు -మన్మోహన్‌ సింగ్‌

ముంబై: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వృద్ధి రేటు క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు దేశ  స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఆర్థికమంత్రి కూడా అయిన మన్మోహన్‌ మరోసారి క్యూ2 జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై స్పందించారు.  ప్రభుత్వం తాజాగా విడుదలచేసిన గణాంకాల ప్రకారం  క్యూ2లో జీడీపీ 4.5 శాతానికి పడిపోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉందన్నారు. వృద్ధి రేటు తగ్గుదల కేవలం ఆర్థిక వ్యవస్థకే కాకుండా సమాజానికి ఎంతో నష్టం చేకూరుస్తుందంటూ  ట్విటర్‌లో పేర్కొన్నారు.  దేశంలో 8నుంచి 9శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉండగా 4.5శాతానికి పడిపోవడం విచారించదగ్గ విషయమన్నారు. ఆర్థిక విధానాల మార్పు ఏ విధంగాను సానుకూల ఫలితాలు ఇవ్వలేదన్నారు.

అంతేకాదు ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా, ప్రస్తుత సమాజంలో ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలగాలంటే 8 శాతం వృద్ధి రేటు నమోదవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ బలోపేతంతో సమాజంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని సానుకూలంగా మార్చవచ్చన్నారు. సమాజ స్థితి ఏ విధంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ చూస్తే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా నశిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఉపాధి రంగాలైన ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మార్కెట్‌లో తిరిగి డిమాండ్‌ పుంజుకునేలా చొరవ చూపాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top