
ముంబైలో స్తంభించిన రైలు, రోడ్డు, విమాన సర్విసులు
వరద నీళ్లలోనే తేలియాడిన కార్లు
రాష్ట్రవ్యాప్తంగా 10 మంది మృతి, ముగ్గురు గల్లంతు
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
ముంబై: ముంబై వరుసగా రెండో రోజూ తడిసిముద్దయింది. మంగళవారం రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు సంబంధించిన వివిధ ఘటనల్లో మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. మిత్తి నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వానల కారణంగా రోడ్డు, రైలు, విమాన సర్విసులపైనా ప్రభావం తీవ్రంగా పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధులు నదులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు నడుముల్లోతు వరదలోనే ముందుకు సాగాల్సి వచి్చంది.
రైలు మార్గాలపై కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల మేర వరద చేరడంతో సెంట్రల్ రైల్వే నడిపే అత్యంత కీలకమైన సబర్బన్ సర్విసులను రద్దు చేసింది. దీంతో, ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. రైళ్లు పట్టాలపైనే నిలిచిపోవడంతో జనం బయటకు దూకి వరద నీళ్లలోనే గమ్యస్థానాలకు కాలినడకన బయలుదేరారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12.30 గంటల వరకే పనిచేసింది. సెంట్రల్ రైల్వే దూరప్రాంత రైలు సర్విసులను రీషెడ్యూల్ లేదా రద్దు చేసింది.
ఛత్రపతి శివాజీ టెర్మినస్–థానే మధ్యలో దాదాపు 8 గంటల తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సీఎస్‌ఎంటీ–మన్‌ఖుర్ద్ హార్బర్ లైన్‌లో రైళ్లు మాత్రం నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి 253 విమానాల టేకాఫ్, మరో 163 విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. దృగ్గోచరత సరిగాలేక 8 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
నిలిచిన మోనో రైళ్లు
సుమారు 700 మందితో మంగళవారం సాయంత్రం బయలుదేరిన మోనో రైళ్లు రెండు అర్థంతరంగా నిలిచిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. మైసూర్ కాలనీ–భక్తి పార్క్ స్టేషన్ల మధ్యన ఉండగా 6.15 గంటల వేళ విద్యుత్ సరఫరా లోపంతో అర్థంతరంగా నిలిచిపోయింది. ఏసీ పనిచేయకపోవడంతో అందులో ఉన్న 582 మంది గంటపాటు ఉక్కిరిబిక్కిరియ్యారు. స్పృహతప్పిన కనీసం 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.
ఫైర్, మున్సిపల్ సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించి, బస్సులో గమ్యస్థానాలకు పంపించారని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. వడాలా స్టేషన్‌కు సమీపంలో 200 మంది ప్రయాణికులతో నిలిచిపోయిన మరో మోనోరైలును అధికారులు విజయవంతంగా వెనక్కి తీసుకెళ్లారు. కాగా, వచ్చే 48 గంటలు అత్యంత కీలకమైన సమయమని సీఎం అన్నారు. ముంబై, థానె, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించామని చెప్పారు.